Bollywood: క్యాస్టింగ్ కౌచ్ పై సరోజ్ ఖాన్, రేణుకా చౌదరి వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: బీజేపీ నేత శత్రుఘ్నసిన్హా

  • క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే
  • బాలీవుడ్ లో లైంగిక దోపిడీపై సరోజ్ ఖాన్ కు తెలిసే ఉంటుంది
  • రాజకీయాల్లో క్యాస్టింగ్ కౌచ్ ను .. ‘క్యాస్టింగ్ - ఓట్ కౌచ్’ అనాలేమో!

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి గళం విప్పినప్పటి నుంచి ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు. ప్రముఖ కొరియో గ్రాఫర్ సరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు.

లైంగిక ఆనందం, లైంగిక దోపిడీ అనేవి అటు వినోద రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఉన్నాయని, ఈ విషయమై సరోజ్ ఖాన్, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సబబేనని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదేనని చెప్పిన శత్రుఘ్న సిన్హా, జీవితంలో ముందుకెళ్లేందుకు అప్పటి పరిస్థితులు డిమాండ్ చేసినట్టుగా కొన్నిసార్లు నడుచుకోకతప్పదని అభిప్రాయపడ్డారు. 

బాలీవుడ్ లో లైంగిక దోపిడీ గురించి సరోజ్ ఖాన్ ప్రస్తావించారంటే.. దాని గురించి ఆమెకు తెలిసే ఉంటుందని, ఆమె వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పారు. సినిమాల్లోకి రావడానికి అమ్మాయిలు ఎలా రాజీ పడాల్సి వస్తుందో తనకు తెలుసని అన్నారు. రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పిన రేణుకా చౌదరి వ్యాఖ్యలను తాను సమర్థిస్తానని, రాజకీయాల్లో క్యాస్టింగ్ కౌచ్ ను ఏ పేరుతో పిలవాలి? .. ‘క్యాస్టింగ్ - ఓట్ కౌచ్’ అనాలేమో! ఇదే పదం సరైనదని మాత్రం చెప్పలేనని అన్నారు. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలం కనుక, సరోజ్ ఖాన్, రేణుక వ్యాఖ్యలను ఖండించవద్దని..అలాంటి వాతావరణాన్ని కల్పించే పరిస్థితులను ఖండించాలని శత్రుఘ్న సిన్హా సూచించారు.

  • Loading...

More Telugu News