Puducherry: ప్రభుత్వ అధికారి లైంగిక వేధింపులు... రికార్డు చేసి బయటపెట్టిన మహిళా ఉద్యోగులు!

  • పుదుచ్చేరిలో లైంగిక వేధింపులు వెలుగులోకి
  • విచారణ కమిటీని వేసిన గవర్నర్ కిరణ్ బేడీ
  • విచారించరాదంటూ స్టే తెచ్చుకున్న ఉన్నతోద్యోగి

మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, వారికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యవహారాన్ని మహిళా ఉద్యోగులు రికార్డు చేసి బయటపెట్టడంతో గవర్నర్ కిరణ్ బేడీ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. ఇక మహిళా ఉద్యోగులతో సదరు అధికారి మాట్లాడిన మాటల్లో ద్వంద్వార్ధాలు వినిపిస్తున్నాయి. తనను చూసుకుంటే కష్టాలుండవని చెప్పడం, ఆఫీసులోకి పాములు వస్తున్నాయని ఓ ఉద్యోగిని చెబితే, "నేను వచ్చి పాములూ పట్టుకుంటా, నిన్నూ పట్టుకుంటా" అంటూ వెకిలి మాటలు ఉన్నాయి.

పుదుచ్చేరి బాలల రక్షణ, సంక్షేమ కమిటీ చైర్మన్, డాక్టర్‌ విద్యా రామ్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ ఆడియో టేపులను బాధితులు అందించారు. వీటితో పాటు కొన్ని వీడియో టేపులనూ వారు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంచాలకుల స్థాయిలో ఉన్న ముగ్గురు అధికారులతో పాటు మొత్తం పది మంది ఉన్నతాధికారులపై 27 మంది ఉద్యోగినులు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.

తమకు సహకరించకుంటే బదిలీ చేస్తామని వారు బెదిరిస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, ఆరోపణలు వచ్చిన ఓ అధికారి, కోర్టుకు వెళ్లి తనను విచారించరాదంటూ స్టే పొందడంతో, దాన్ని ఎత్తి వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విద్యా రామ్ కుమార్ వెల్లడించారు.

More Telugu News