Aadhar: ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ లింక్ అయిన 1.30 లక్షల ఖాతాల వివరాలు లీక్!

  • ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో వివరాలు
  • వెబ్ సైట్ మూసివేత
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న సర్కారు

తమ తమ బ్యాంకు ఖాతాలకు ప్రజలు ఆధార్ అనుసంధానం చేసుకుంటున్న వేళ, సుమారు 1.30 లక్షల మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు తెలుస్తోంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన యూఐడీఏఐ, ఆ సమాచారం అత్యంత భద్రంగా తమ వద్ద ఉందని ఇటీవలే సుప్రీంకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ డేటాబేస్ ను బద్దలు కొట్టడం అసాధ్యమని కూడా ప్రకటించింది.

అయితే, హాకర్లు అంతగా శ్రమించి యూఐడీఏఐ సర్వర్లలోకి జొరబడాల్సిన అవసరం లేకుండా, వివిధ ప్రభుత్వ విభాగాలు ఆధార్ సంఖ్యతో సమాచారాన్ని సేకరిస్తూ, ప్రజల బ్యాంకు ఖాతా వివరాలు, వారి కులమతాలు, ఆదాయ వనరులు తదితర విషయాలను సమీకరిస్తుండటంతో హాకర్ల పని సులువుగా మారింది. ప్రభుత్వ సంస్థల్లో కొన్ని ప్రజల ఆధార్ వివరాలను అందరికీ కనిపించేలా వెబ్ సైట్లలోనూ పెడుతున్నాయి.

ఈ జాబితాలో తాజాగా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా వచ్చి చేరింది. మొత్తం 1.3 లక్షల మంది ఖాతాలను, వారి పూర్తి సమాచారాన్ని బయటకు వెల్లడించింది. ఈ లీక్ చాలా ప్రమాదకరమని, ఉదాహరణకు ఎవరైనా 'దళితులు', లేదా 'ముస్లింలు' అని సెర్చ్ చేస్తే విశాఖపట్నంలో లేదా కర్నూలులో ఉన్న దళితులు, ముస్లింల సంఖ్య, వారి వివరాలు తదితరాలు వచ్చేస్తున్నాయని హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ కొడాలి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ కు, రీసెర్చర్ లు చెబుతున్న దానికీ పూర్తి వ్యత్యాసం ఉండటం గమనార్హం.

ఆధార్ ఖాతాలను కులం లేదా మతం వివరాల కోసం వినియోగించేది లేదని యూఐడీఏఐ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో లబ్దిదారుల ఎంపిక ఆధార్ లోని కులమతాల ఆధారంగానే జరుగుతోందన్నది నిజమని పలువురు నిపుణులు అంటున్నారు. యూఐడీఏఐ సేకరించిన బయో మెట్రిక్ వివరాలను వాడే విషయంలో నియమ నిబంధనలు కఠినంగానే ఉన్నప్పటికీ, అమలు మాత్రం జరగడం లేదన్నది అత్యధికుల వాదన.

ఇక పీపుల్స్ హబ్ గా ఏపీ ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్ సైట్ ఈ ఆరోపణల తరువాత మూతబడింది. ఈ వెబ్ సైట్ లో 29 విభిన్న విభాగాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోఢీకరించేందుకు ఆధార్ సంఖ్యను వినియోగించారు. ఇది విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాలూ ఇదే తరహా విధానాన్ని పాటించాలని భావిస్తుండటంతో దేశంలో డేటా ప్రైవసీ మరింతగా దెబ్బతింటుందని, మరిన్ని ఖాతాల వివరాలు బహిర్గతమవుతాయని, ఇది అనిశ్చితికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఆధార్ వివరాల లీక్ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరగా, తాము ఆధార్ చట్టం 2016లోని అన్ని నియమ నిబంధనలనూ పాటిస్తున్నామని, డేటా ప్రైవసీపై కోర్టుల ఆదేశాలు పాటిస్తున్నామని తెలిపింది. ఈ వార్తలను పరిగణనలోకి తీసుకున్నామని, విచారిస్తున్నామని, పూర్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

More Telugu News