Uttar Pradesh: ఎనిమిదేళ్ల వయసులో విక్రయం... పదహారేళ్లకు నలుగురు బిడ్డల తల్లి... ఐపీసీలోని అరుదైన సెక్షన్లు పెట్టి నిందితుల విచారణ!

  • యూపీలో దారుణాతి దారుణం
  • ఐపీసీలోని అరుదైన సెక్షన్లతో కేసు
  • కఠిన శిక్షలు పడేలా చూస్తామన్న పోలీసులు

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ దారుణాతి దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారిని సంవత్సరాల తరబడి బంధించి అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కదిలారు. భారతీయ శిక్షాస్మృతిలోని అత్యంత అరుదుగా వాడే సెక్షన్లను జోడించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2010 సంవత్సరంలో భరత్ పూర్ కు చెందిన దంపతులు తమ ఎనిమిది సంవత్సరాల బిడ్డను ఓ వ్యక్తికి విక్రయించారు. ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న మరో ఇద్దరు బిడ్డలను రాజస్థాన్ లో విక్రయించారు.

బాధితురాలిని రూ. 3 లక్షలకు కొనుగోలు చేసిన 50 సంవత్సరాల వ్యక్తి, చిన్న పాపని కూడా చూడకుండా పెళ్లిచేసుకున్నాడు. తమ మనవరాలి వయసున్న అమ్మాయిపై నిత్యమూ అత్యాచారం చేశాడు. ఆరేళ్ల వ్యవధిలో నలుగురు బిడ్డలను కన్నాడు. వారిలో ఇద్దరు బిడ్డలు పుట్టగానే మరణించారు. ఇక అక్కడ ఉండలేక పారిపోయి సంబల్ లోని తన బంధువుల ఇంటికి చేరిన బాలిక, వారి సాయంతో పోలీసు కేసు పెట్టింది.

ఈ కేసులో బాధితురాలిని ఎటువంటి వైద్య పరీక్షలకు పంపించలేదని, ఆమె బిడ్డల తల్లని, నిత్యమూ అత్యాచారానికి గురైందని చూడగానే తెలిసిపోయిందని పోలీసులు వెల్లడించారు. పాపను విక్రయించిన తల్లిదండ్రులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు పెట్టామని తెలిపారు. ఇదో అసాధారణ కేసుగా అభివర్ణించిన పోలీసులు, 366 ఏ (మైనర్ బాలికను కొనుగోలు చేయడం), 372 (మైనర్ బాలికను వేశ్యావృత్తి నిమిత్తం విక్రయించడం), 370 ఏ (అక్రమంగా తెచ్చిన అమ్మాయిని వేధించడం) వంటి పలు సెక్షన్లు పెట్టినట్టు తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని తెలిపారు. 

More Telugu News