Suryapet District: కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలాలు సూర్యాపేట జిల్లాకు అందుతాయి: మంత్రి హరీశ్ రావు

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది
  • నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే
  • నాకు చాలా ఆనందంగా ఉంది

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలాలు సూర్యాపేట జిల్లాకు అందుతాయని తెలంగాణ ఇరిగేషన్ శాఖా మంత్రి హరీశ్ రావు చెప్పారు. చివ్వెంల మండలం నామవరం దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాలువల పనులను, భక్తలాపురం దగ్గర ఇరిగేషన్ కెనాల్స్ ను ఈరోజు ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మోతె మండలం నామవరంలో జరిగిన బహిరంగ సభలో హరీశ్ రావు, మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, నాగార్జునసాగర్, మూసీ, డిండి ప్రాజెక్టుల కింద ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ వల్ల అద్భుతమైన పంట పండిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. వచ్చే యాసంగికి నీరివ్వడమే తమ లక్ష్యమని, జూన్ నాటికి కాలువ పనులు పూర్తి చేయనున్నట్టు చెప్పారు.

నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా భూమికి బరువైనట్లుగా ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయని, తనకు చాలా ఆనందంగా ఉందని హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంటున్నందున రికార్డ్ స్థాయిలో పంటలు పండాయని అన్నారు. 24 గంటల కరంట్ తో వ్యవసాయంలో అద్భుతం ఆవిష్కృతమైందని అన్నారు.నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉందని, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద వారబంది విధానంలో చివరి ఆయకట్టు రైతాంగానికి కూడా సాగునీరందించడం వల్ల ఫలితాలు వచ్చాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణాలో రైతులు సంతోషంగా ఉన్నారని, అందరికీ, సాగు చేసే ప్రతి భూమికి రైతుకు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.

మరి కొద్ది రోజుల్లోనే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద సాగునీరిస్తామని, ఈ ప్రాజెక్టుకు చెందిన పనులు 98 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు తెలిపారు. పండించిన పంటకు ఇబ్బంది కాకూడదని గోదాంలను నిర్మిస్తున్నామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిలో టార్పాలిన్ కవర్లు సరఫరా చేశామని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా అన్నిజాగ్రతలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల తర్వాత వాటి రవాణా కూడా తొందరగా చేస్తున్నట్టు తెలిపారు.
 
త్వరలో నల్గొండలో బత్తాయి, నకిరేకల్ లో నిమ్మ మార్కెట్లు! 

నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ పనులు పూర్తి కావస్తున్నాయని మరో నెలరోజుల్లోనే దీనిని ప్రారంభిస్తామని హరీశ్ రావు తెలిపారు. నల్లగొండలో బత్తాయి మార్కెట్ పనులు పూర్తి అయ్యాయని, అతి త్వరలో దాన్ని కూడా  ప్రారంభించనున్నామని, గత ప్రభుత్వాల హయాంలో రైతులు నానా అవస్థలు పడ్డారని విమర్శించారు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి, రైతులతో చర్చించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, ధాన్యం తరలింపు తదితర అంశాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అదనపు లారీలను తరలించి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆoచనా వేస్తూ అప్రమత్తంగా  ఉండాలని ఆదేశించారు. 

More Telugu News