Uttar Pradesh: బహిరంగ సభా వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు చుక్కెదురు!

  • బహిరంగ సభలో ప్రజా నిరసన
  • మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రశ్నించిన సీఎం
  • ముక్తకంఠంతో 'లేదు' అంటూ నినదించిన దళితులు

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఓ బహిరంగ సభలో ప్రజా నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతాప్ గఢ్ సమీపంలో దళితులు ఎక్కువగా ఉన్న కాందాయిపూర్, మధుపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన ఓ బహిరంగ సభలో గ్రామ్ స్వరాజ్ యోజన పథకం గురించి మాట్లాడుతూ, గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందా? అని ప్రశ్నించగా, ఆయనకు ఊహించని సమాధానం ఎదురైంది.

అక్కడున్న వారంతా ముక్తకంఠంతో 'లేదు' అని బిగ్గరగా అరవడంతో వేదికపై ఉన్న ఆదిత్యనాథ్ సహా మిగతా నేతలంతా అవాక్కయ్యారు. తమ గ్రామంలో కనీసం ఒక్క టాయిలెట్ కూడా నిర్మించలేదని వారు నినాదాలు చేశారు. ఆపై స్థానిక అధికారులను అక్కడికి పిలిపించిన సీఎం, 24 గంటల్లో తాను డబ్బు పంపిస్తానని, వెంటనే మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని ఆదేశించారు. ఆపై ఓ దళిత కుటుంబం వద్దకు వెళ్లి, వారింట్లో రాత్రి భోజనం చేశారు.

More Telugu News