Siddipet: సిద్దిపేటలో అర్ధరాత్రి కలకలం సృష్టించిన ప్రేమజంట!

  • రెండు రోజల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట
  • గత రాత్రి సిద్దిపేట బస్టాండ్‌లో నురగలు కక్కిన యువకుడు
  • ఆసుపత్రిలో మృతి.. చికిత్స పొందుతున్న యువతి

తెలంగాణలో ఓ ప్రేమ జంట అర్ధరాత్రి వేళ కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా నురగలు కక్కుతూ కిందపడిన ప్రేమికుడిని రక్షించే ప్రయత్నంలో ప్రేమికురాలు కూడా అస్వస్థతకు గురైన సంఘటన సిద్దిపేట కొత్త బస్టాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలంలోని రేగులపల్లికి చెందిన కె.సంతోష్‌రెడ్డి (28), అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

సోమవారం అర్ధరాత్రి సిద్దిపేట కొత్త బస్టాండ్‌కు చేరుకున్న వారు అక్కడ బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లిన సంతోష్ కాసేపటికే నురగలు కక్కుతూ బయటకు వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన ప్రేమికురాలు వెంటనే వెళ్లి అతడిని కాపాడే ప్రయత్నం చేసింది. శ్వాస తీసుకునేందుకు యువకుడు ఇబ్బంది పడుతుండడంతో అతడికి నోటి ద్వారా శ్వాస అందిస్తూ నోటిలోని నురగను తీయబోయింది.

చుట్టూ మూగిన స్థానికులు, ప్రయాణికులు వద్దని వారిస్తున్నా వినకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. దీంతో ఆమె కూడా అస్వస్థతకు గురైంది. అప్రమత్తమైన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే సంతోష్ రెడ్డి మృతి చెందాడు. అతడు ఏదో విషం తీసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News