Andhra Pradesh: గనులు, భూగర్భ వనరుల శాఖలో సాంకేతిక వినియోగానికి పెద్దపీట వేయాలి : ఏపీ సీఎస్

  • గనులు, భూగర్భ వనరుల శాఖ సమీక్ష నిర్వహణ
  • ఇసుక పై ఫిర్యాదులు నా దృష్టికి తీసుకురావాలి
  • మైనింగ్ పై ప్రత్యేక పాలసీని రూపొందించుకోవాలి
  • డ్రోన్ల వినియోగం సాధ్యాసాధ్యాలపై త్వరలో సమావేశం

గనులు, భూగర్భ వనరుల శాఖలో సాంకేతిక వినియోగానికి పెద్దపీట వేయాలని, ఇందుకోసం ఐటీ నిపుణుల సేవలు వినియోగించుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఖనిజ ఆదాయం, రాష్ట్రంలో ఇసుక కార్యకలాపాలపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని శాఖల్లోనూ ఐటీ వినియోగం పెరిగిందని గనులు, భూగర్భ వనరుల శాఖలోనూ దీనిని వినియోగించాలని ఆదేశించారు. సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెరుగుదలతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు.

సున్నపురాయి వినియోగంలో సిమెంట్ కంపెనీలపై నిఘా వేయాలని, సిమెంట్ తయారీకి కాకుండా ఇతర అవసరాలకు సున్నపురాయి ఖనిజాన్ని వినియోగించకుండా చూడాలని, ఇందుకోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఖనిజాలను తరలించే వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని అన్నారు. మైనింగ్ పై ప్రత్యేక పాలసీని రూపొందించుకోవాలని, మైనింగ్ జరిపే ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం సాధ్యాసాధ్యాలపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 181 ఇసుక రీచ్ లు ఉన్నాయని, వాటిలో 163 పనిచేస్తున్నాయని, మిగిలిన 23 మూతపడ్డాయని దినేష్ కుమార్ కు బి.శ్రీధర్ వివరించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా గట్టి నిఘా వేయాలని, ఇసుక మాఫియా పై వచ్చే ఫిర్యాదులను జిల్లాల వారీగా ప్రతి వారమూ తన దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు.  
 
తొలుత, 2017-18 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ఆర్జించిన ఆదాయం, 2018-19లో భవిష్యత్తు కార్యాచరణపై ఆ శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2017-18లో రూ.1,960 కోట్ల మేర ఆదాయ ఆర్జన లక్ష్యంగా నిర్దేశించగా, 109 శాతం మేర రూ. 2,146 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో మేజర్ మినరల్స్ ద్వారా రూ.1,047 కోట్లు, మైనర్ మినరల్స్ తో రూ.1,099 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,500 కోట్ల మేర ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని, గ్రానైట్ ద్వారా ఆదాయం తక్కువగా ఉందని, భవిష్యత్తులో దీన్ని మరింత పెంచాలని దినేష్ కుమార్ ఆదేశించారు.  

More Telugu News