Andhra Pradesh: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!

  • చంద్రబాబుపై  సోము వీర్రాజు వ్యాఖ్యలు కచ్చితంగా కుట్రలో భాగమే
  • ఆ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయి
  • చంద్రబాబుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నారు

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ మండిపడ్డారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా కుట్రలో భాగమేనని, 2019లో చేయబోయే నేరపూరిత కుట్రకు ముందస్తు హెచ్చరికగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాజమహేంద్రవరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు.

అనంతరం, మీడియాతో గన్ని కృష్ణ మాట్లాడుతూ, హింసను ప్రేరేపించే విధంగా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా, తమ ప్రాణాలను అడ్డుపెట్టి చంద్రబాబును కాపాడుకుంటామని, ఐదు కోట్ల మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు బాబుకు అండగా ఉన్నారని అన్నారు.

వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ నేత సోము వీర్రాజు వంటి నేతల కుట్రలను తాము చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని అన్నారు. కాగా, శనివారం నాడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా సరే పరిస్థితులు బాగోనప్పుడు వరుసతప్పి మాట్లాడతారని, అలాగే 2004లో అలిపిరి ఘటన కనిపించిందని, 2019లో మళ్లీ అదే జరుగుతుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News