తునాతునకలైన 63 మంది శరీర భాగాలు.. ఏరులై పారిన రక్తం.. కాబూల్‌లో ఉగ్రవాదుల ఘాతుకం!
- ఓటరు నమోదు కేంద్రంపై ఆత్మాహుతి దాడి
- ఏం జరిగిందో తెలియక అరుపులు, కేకలతో హోరెత్తిన ప్రాంతం
- పేలుడు ధాటికి నిలువునా కుప్పకూలిన రెండంతస్తుల భవనం
ఓటరు నమోదు కేంద్రం వద్దకు తాపీగా నడుచుకుంటూ వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళ సభ్యుడు కార్యాలయం గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది. ఎటుచూసినా మాంసపు ముద్దలతో, రక్తంతో ఆ ప్రాంతం నిండిపోయింది. శరీర భాగాలు చాలా దూరం ఎగిరిపడ్డాయి. పేలుడుతో ఏం జరిగిందో తెలియక జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది.
పేలుడు ధాటికి రెండంతస్తుల ఓటు నమోదు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాలు కదిలిపోయాయి. అద్దాలు బద్దలయ్యాయి. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రకటించింది. సాయంత్రానికి ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన చేస్తూ దాడికి పాల్పడింది తామేనని పేర్కొంది.
ఆత్మాహుతి దాడిలో మరణించిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు, చిన్నారులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర బాఘ్లాన్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ఘటనలో బాంబు పేలి ఐదుగురు మరణించారు.