Kodandaram: ఆ నియోజక వర్గం నుంచే కోదండరామ్‌ పోటీ చేయనున్నారా?

  • ఇటీవలే టీజేఎస్‌ పార్టీ స్థాపించిన కోదండరామ్
  • పలు ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు
  • టచ్‌లో ఉన్న ఇతర పార్టీల నేతలు
  • జనగామ నుంచే కోదండరామ్‌ పోటీ చేయాలని పార్టీ నేతల సూచన

టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ మొదట జనగామ పోరుగడ్డపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే, స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తితో పాటు పలు ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేరే విధంగా స్థానిక నాయకులు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది.

అంతేకాదు, ఆయా పార్టీల నేతలు కొందరు కోదండరామ్‌తో నేరుగా టచ్‌లో ఉంటున్నారు. కోదండరామ్‌ 2019 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఆయన పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఆయనను కోరుతున్నట్లు సమాచారం. ఈ విధంగా ప్రణాళిక రచించుకుని ముందుకు వెళితే, రాజకీయ భవిష్యత్‌తోపాటు రాష్ట్ర రాజకీయాలపై పట్టుసాధించవచ్చనేది వారి సూచన. కాగా, ఈ నెల 29న  తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో టీజేఎస్‌ ఆవిర్భావ సభను నిర్వహించనుంది. అందుకోసం ప్రస్తుతం ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News