Balakrishna: బాలకృష్ణ 'జైసింహా' విడుదలై నేటికి 100 డేస్... ఇంకా సినిమా ఆడుతున్న కేంద్రాలివే!

  • మూడు కేంద్రాల్లో శతదినోత్సవం
  • యమ్మిగనూరు, చిలకలూరిపేటలో డైరెక్టుగా
  • ప్రొద్దుటూరులో షిప్టింగ్ పై 100 డేస్

బాలకృష్ణ తాజా చిత్రం 'జైసింహా' విడుదలై 100 రోజులు పూర్తయింది. ఇవాళ, రేపు ఓ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ కొట్టినా, మూడో వారం వరకే పరిమితమై, నాలుగో వారానికి కలెక్షన్లు తగ్గుతాయన్న సంగతి తెలిసిందే. విపరీతంగా పెరిగిన మల్టీప్లెక్స్ థియేటర్లతో సినిమా విడుదలైన రోజుల వ్యవధిలోనే అందరూ చూసేస్తున్న కాలమిది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలేమో.

దాదాపు మూడున్నర నెలల క్రితం విడుదలైన 'జైసింహా' ఎమ్మిగనూరు, చిలకలూరిపేట, ప్రొద్దుటూరు పట్టాణాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఎమ్మిగనూరులో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంటున్న బాలకృష్ణ పదో చిత్రం ఇదని సినీ పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతకుముందు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహా, లెజండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి ఇక్కడ డైరెక్టుగా 100 డేస్ ఆడాయని గుర్తు చేశారు.

ఇక చిలకలూరిపేటలోనూ డైరెక్టుగా శతదినోత్సవాన్ని జరుపుకుంటున్న 'జైసింహా', ప్రొద్దుటూరులో మాత్రం వెంకటేశ్వర థియేటర్లో 21 రోజులు ప్రదర్శింపబడి, ఆపై అర్చనా థియేటర్ కు మారి 79వ రోజును పూర్తి చేసుకుందని వంశీ శేఖర్ తెలిపారు.

More Telugu News