మొహాలీ మ్యాచ్‌లో ‘గేల్’ దుమారం.. పంజాబ్ విజయం!

20-04-2018 Fri 06:35
  • స్టేడియంలో విధ్వంసం సృష్టించిన గేల్
  • సిక్సర్లతో విరుచుకుపడిన వైనం
  • ఐపీఎల్‌లో తొలి ఓటమి నమోదు చేసిన హైదరాబాద్

ఐపీఎల్‌లో భాగంగా గురువారం మొహాలీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘గేల్’ దుమారం రేగింది. పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు పెట్టగా, ప్రతిసారీ స్టాండ్స్‌లోకి వెళ్లి పడుతున్న బంతి కోసం ఫీల్డర్లు పరుగులు పెట్టారు. అభిమానుల్లో ఎవరో తమకు మూడు సిక్సర్లు కావాలని ప్లకార్డు చూపిస్తే గేల్ ఏకంగా నాలుగు వరుస సిక్సర్లు బాదాడు. కేవలం 63 బంతుల్లో ఒక ఫోర్, 11 సిక్సర్లతో సెంచరీ (104) పూర్తి చేసుకున్నాడు.

 ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ 18, మయాంక్ అగర్వాల్ 18, కరుణ్ నాయర్ 31, అరోన్ ఫించ్ 14 పరుగులు చేయగా గేల్ అజేయంగా 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అనంతరం 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. పంజాబ్ జట్టుకు ఇది మూడో విజయం కాగా, అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు ఇది తొలి ఓటమి. సెంచరీతో రెచ్చిపోయిన గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.