Andhra Pradesh: సీసీటీఎన్ఎస్ (ఇ-కాప్స్) ప్రాజెక్టు సమర్థ నిర్వహణకు చర్యలు చేపట్టండి: ఏపీ సీఎస్

  • అమరావతిలో ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి
  • మే 1వ తేదీ లోగా పనులు చేపట్టాలి
  • ఇ-ప్రగతి ప్లాట్ ఫారమ్ ను కూడా వినియోగించుకోవాలి

జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళికలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ఇ కాప్స్ (ఎంటర్ ఫ్రైస్ ఇకాప్స్) ప్రాజెక్టును రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశం ఈరోజు అమరావతి సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు (ఇకాప్స్)కు సంబంధించి అమరావతిలో ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీని నిర్వహణకు సిస్టమ్ ఇంటిగ్రేటర్ గా ఉన్న టీసీఎస్ ప్రతినిధులను డేటా సెంటర్ ఏర్పాటు ఇతర నిర్వహణా పనులను మే1వ తేదీ లోగా పనులు చేపట్టాలని, నిర్దేశిత సమయానికి అనుగుణంగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీటీఎన్ఎస్ (ఇకాప్స్) ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా ఏఏ శాఖలను సమన్వయం చేసుకోవాలనే దానిపై రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈఓను సంప్రదించి ఆయా శాఖల జాబితాను రూపొందించాలని డీజీపీ ఎం. మాలకొండయ్య ఆదేశించారు. అలాగే, ఇ-ప్రగతి ప్లాట్ ఫారమ్ ను కూడా ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ప్రగతిని ప్రతి నెలా సంబంధిత అధికారులతో సమావేశమై ఎప్పటికప్పడు సమీక్షించాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టుకు 18 కోట్ల 35 లక్షల రూపాయల మంజూరు 

సీసీటీఎన్ఎస్ (ఇకాప్స్) ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటు, ఇతర వ్యవహారాల నిర్వహణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 18 కోట్ల 35 లక్షల రూపాయలు మంజూరు చేసిందని డీజీపీ మాలకొండయ్య అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అవసరమైన సౌకర్యాలను కల్పించి ఆయా స్టేషన్లకు చెందిన కేసులు ఇతర వివరాలన్నీ సీసీటీఎన్ఎస్ - ఇకాప్స్ అప్లికేషన్ తో అనుసంధానించి ఆన్ లైన్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చామని అన్నారు.  బీఎస్ఎన్ ఎల్, స్వాన్ నెట్వర్క్ కనెక్టవిటీ సౌకర్యాన్ని కల్పించి, ఆ విధానాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సీసీటీఎన్ఎస్ విధానం పర్యవేక్షణకు ఐజీపీ టెక్నికల్ సర్వీసెస్ ను నోడల్ అధికారిగా నియమించి పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు.
 
కాగా, కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేయబడే సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును ఇకాప్స్ అప్లికేషన్ కింద రాష్ట్రంలోని సుమారు 1019 పోలీస్ స్టేషన్లను అనుసంధానించి ఆయా పోలీస్ స్టేషన్లకే సంబంధించిన నేరాల వివరాలన్నీ ఈ ట్రాకింగ్ విధానంలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా ఫిర్యాదుల నిర్వహణ విధానం, ఎఫ్ఐఆర్, కోర్టులు, ప్రాజిక్యూషన్, ఇన్వెస్టిగేషన్, స్టేషన్ హౌస్ నిర్వహణతో పాటు మంత్లీ క్రైమ్ రివ్యూ, పోలీస్ మెసేజింగ్ సిస్టమ్, లెర్నింగ్ మేనేజిమెంట్ సిస్టమ్, క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ఇంట్రానెట్ పోర్టల్, సిటిజన్ పోర్టల్ వంటి 14 రకాల మోడ్యూల్స్ ను ఈ విధానంలో ఆన్ లైన్ లో ఉంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేయనున్నారు. దీనివల్ల ఆయా కేసుల వివరాలను పురోగతిని ఎక్కడి నుండైనా పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది.

More Telugu News