judge loya: న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాల్జేయడానికే జడ్జి లోయా మృతిపై పిటిషన్లు: సుప్రీంకోర్టు ఆగ్రహం

  • జడ్జి లోయాది సహజ మరణమే
  • ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేయరాదు
  • ఈ పిటిషన్లకు ఎటువంటి అర్హత లేదన్న కోర్టు

సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతిపై సిట్ ద్వారా ప్రత్యేక దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. జడ్జి లోయాది సహజ మరణమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాల్జేయడానికి చేసిన ప్రయత్నంగా పిటిషన్లను అభివర్ణించింది.

‘‘ఈ పిటిషన్లకు ఎటువంటి యోగత్య లేదు. సిట్టింగ్ జడ్జిల తీర్పును (లోయా మృతిపై దిగువ కోర్టు తీర్పు) తప్పు పట్టేందుకు కారణం లేదు. పిటిషనర్ల ప్రయత్నమల్లా న్యాయవ్యవస్థకు నష్టం కలిగించడమే’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యక్తిగత లక్ష్యాలు, రాజకీయ పరమైన అంశాల కోసం ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ అన్నారు.

కాగా, జడ్జి లోయా 2014 డిసెంబర్ 1న నాగ్ పూర్ లో తన సహచర ఉద్యోగి కుమార్తె వివాహానికి వెళ్లిన సమయంలో గుండె పోటుకు గురై ప్రాణాలు విడిచారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు దర్యాప్తును జడ్జి లోయా చేపట్టడంతో ఆయన హత్య కుట్ర ప్రకారం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.

More Telugu News