నా కొడుకును నీరవ్ మోదీతో పోలుస్తారా?.. భావోద్వేగానికి గురైన మంత్రి జూపల్లి

  • వ్యాపారంలో ఉన్నవారు రుణాలు తీసుకోవడం సహజం
  • చెల్లించిన దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు
  • ఎవరినీ వదిలిపెట్టేది లేదు
  • హెచ్చరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

తన కుమారుడు అరుణ్‌ను బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీతో పోల్చడాన్ని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు జీర్ణించుకోలేకపోయారు. అరుణ్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకు రుణం విషయంలో సీబీఐ తమకు నోటీసులు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

నకిలీ నోటీసులతో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాము రాజకీయాల్లోకి రాకముందే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని పూర్తిగా చెల్లించినట్టు గుర్తు చేశారు. వ్యాపారం కోసం అరుణ్ రుణం తీసుకున్న మాట వాస్తవమేనని, అలా తీసుకున్నదాంట్లో రూ.31 కోట్లకు పైగా తిరిగి చెల్లించాడని పేర్కొన్నారు. తాము అప్పులు మాత్రమే చేశామని, తప్పులు కాదని జూపల్లి స్పష్టం చేశారు.

తమ ఆస్తులను తనఖా పెట్టుకునే బ్యాంకులు అప్పులు ఇచ్చాయని, వాటిని వడ్డీతో సహా వసూలు చేసుకుంటాయని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చినట్టు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం మూడున్నరేళ్ల మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర తనదని గుర్తు చేశారు. సీబీఐ పేరిట తప్పుడు నోటీసులు తయారు చేసిన వారిపై పరువు నష్టం దావా, క్రిమినల్ కేసులు వేయనున్నట్టు మంత్రి జూపల్లి పేర్కొన్నారు .

More Telugu News