Tamilnadu: కాలేజీ అమ్మాయిలకు మార్కులు, డబ్బులు ఆశ చూపే నిర్మలాదేవి సెల్ ఫోన్ లో పెద్దల రాతలు... రంగంలోకి సీబీసీఐడీ!

  • విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్
  • ఆమె సెల్ ఫోన్ లో పలువురి పెద్దల ఫోన్ నంబర్లు
  • విచారణలో నోరు మెదపని నిర్మలాదేవి 
  • సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు జారీ

కాలేజీ అమ్మాయిలకు డబ్బులు, అధిక మార్కులు ఆశచూపి, వారిని లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించగా, పోలీసుల అదుపులో ఉన్న నిర్మలాదేవి, విచారణలో నోరు విప్పడం లేదని తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్ లో పలువురు ప్రముఖులు, వీఐపీల నంబర్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ వివాదం పెనుదుమారం అవుతుండటంతో గవర్నర్ బన్వరిలాల్ తో కామరాజర్ వర్శిటీ వైస్ చాన్స్ లర్ చెల్లదురై భేటీ అయి, మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చారు.

కాగా, విరుదునగర్‌ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాశాల మ్యాథ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలా దేవి, విద్యార్థినులను ఎవరి వద్దకు వెళ్లాలని ప్రేరేపించిందన్న విషయాన్ని తేల్చడమే లక్ష్యంగా పోలీసులు విచారిస్తున్నారు. రాత్రంతా ఆమె నుంచి సమాధానాన్ని రాబట్టే ప్రయత్నాన్ని చేసినా ఫలితం లేకపోయింది. ఆమె చేసే వాట్స్ యాప్ చాటింగ్, తరచూ మాట్లాడే నంబర్లు ఎవరివో తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని సీబీసీఐడీ ఏర్పాటు చేసింది. సైబర్ క్రైమ్ విభాగం సైతం ఆ పెద్దలు ఎవరో తేల్చే పనిలో నిమగ్నం కాగా, ప్రభుత్వంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ కేసులో గవర్నర్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించగా, సీబీఐకి అప్పగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదిలావుండగా, ప్రొఫెసర్ వెనకున్న వాళ్లను విచారించి కఠిన శిక్షలు విధించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. చెన్నై రాజ్ భవన్ ముట్టడికి వారు యత్నించడంతో భద్రతను పెంచారు. నిర్మలాదేవికి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించగా, మధురై సెంట్రల్ జైలుకు ఆమెను తరలించారు. ఆమెను కస్టడీకి తీసుకునే ఉద్దేశంలో ఉన్న సీబీసీఐడీ, నేడు కోర్టులో పిటిషన్ వేయనుంది.

  • Loading...

More Telugu News