Andhra Pradesh: ప్రచార పోస్టర్ లో చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని హంగామా!

షార్ట్స్‌లో చూడండి
 పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆర్టీసీ బస్సుపై అతికించిన ప్రచారపోస్టర్ లో సీఎం చంద్రబాబు ఫొటో చిరిగి ఉండటంతో మండిపడ్డారు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లపై దుర్భాషలాడారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగింది. స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానానికి చింతమనేని నిన్న వెళ్లారు.

అదే సమయంలో నూజీవీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది. ఆ బస్సుపై అతికించిన ప్రచారపోస్టర్ లో చంద్రబాబు ఫొటో చిరిగి ఉండటాన్ని చింతమనేని గమనించారు. వెంటనే, తన అనుచరులను పంపి ఆ బస్సును అడ్డగించారు. డ్రైవర్ వడ్డి శేఖర్, కండక్టర్ తోట వాసుబాబును కిందకు దించి, వారిపై చింతమనేని విరుచుకుపడ్డారు.

‘ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫొటో చిరిగి ఉంటే తామేమి చేస్తామని వారు సమాధానం చెప్పడంతో చింతమనేని మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు (చంటి) కలుగజేసుకుని, ప్రభుత్వ ఉద్యోగులతో ప్రవర్తించే తీరు ఇదేనా? అంటూ చింతమనేనిని ప్రశ్నించారు. దీంతో, ఆ స్థానికుడిపై చింతమనేని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, చేయి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రధాన కూడలికి చేరుకుని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu

More Telugu News