Andhra Pradesh: ప్రచార పోస్టర్ లో చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని హంగామా!

  • కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో సంఘటన
  • ఆర్టీసీ బస్సుపై ప్రచారపోస్టర్ లో చిరిగి ఉన్న చంద్రబాబు ఫొటో
  • ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్లపై చింతమనేని దుర్భాష
  • ప్రశ్నించిన స్థానికుడికి చేదు అనుభవం 

 పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆర్టీసీ బస్సుపై అతికించిన ప్రచారపోస్టర్ లో సీఎం చంద్రబాబు ఫొటో చిరిగి ఉండటంతో మండిపడ్డారు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లపై దుర్భాషలాడారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగింది. స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానానికి చింతమనేని నిన్న వెళ్లారు.

అదే సమయంలో నూజీవీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది. ఆ బస్సుపై అతికించిన ప్రచారపోస్టర్ లో చంద్రబాబు ఫొటో చిరిగి ఉండటాన్ని చింతమనేని గమనించారు. వెంటనే, తన అనుచరులను పంపి ఆ బస్సును అడ్డగించారు. డ్రైవర్ వడ్డి శేఖర్, కండక్టర్ తోట వాసుబాబును కిందకు దించి, వారిపై చింతమనేని విరుచుకుపడ్డారు.

‘ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫొటో చిరిగి ఉంటే తామేమి చేస్తామని వారు సమాధానం చెప్పడంతో చింతమనేని మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు (చంటి) కలుగజేసుకుని, ప్రభుత్వ ఉద్యోగులతో ప్రవర్తించే తీరు ఇదేనా? అంటూ చింతమనేనిని ప్రశ్నించారు. దీంతో, ఆ స్థానికుడిపై చింతమనేని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, చేయి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రధాన కూడలికి చేరుకుని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు.

More Telugu News