SBI: ఎస్బీఐకి కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన తెలంగాణ మంత్రి జూపల్లి కుమారులు.. రంగంలోకి సీబీఐ!

  • 2013లో శైలి ఇన్ ఫ్రాటెక్ ను పెట్టి రూ. 64. 80 కోట్ల రుణం
  • ఆ మరుసటి సంవత్సరంలోనే సంస్థ విక్రయం
  • వడ్డీతో కలిపి రూ. 86.30 కోట్లకు బకాయి
  • తనఖా ఆస్తులపై వివాదాలతో ఎస్బీఐ అవాక్కు

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారులు అరుణ్, వరుణ్ లతో పాటు కిరణ్ రెడ్డి అనే మరో వ్యక్తి ప్రమోట్ చేసిన శైలి ఇన్ ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 64.80 కోట్లు రుణంగా తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా ప్రాజెక్టులు, నీటి పారుదల, రహదారుల ప్రాజెక్టులకు సేవలందించే సంస్థగా ఉన్న ఈ కంపెనీకి జూపల్లి కుమారుడు అరుణ్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పేరిట రిజిస్టర్ చేయించుకుని, వాటి విలువను అధికంగా చూపిస్తూ రుణాలు పొందారన్నది వీరిపై ఉన్న ఆరోపణ కాగా, ఈ 'తనఖా' మాయాజాలంపై నిజాలను తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.

ఈ సంస్థ ఐదేళ్ల క్రితం కిస్మత్ పూర్ లోని నాలుగు ఎకరాల భూమితో పాటు గగన్ పహాడ్ వద్ద ఉన్న మూడు ఎకరాల భూమిని, అమీర్ పేటలోని మూడు ఫ్లాట్లను, గగన్ పహాడ్ లోని ఓ ఇంటిని తనఖా పెడుతూ రూ. 64.80 కోట్ల రుణం తీసుకుంది. ఈ సంవత్సరం జనవరి నాటికి తీసుకున్న రుణం వడ్డీతో కలిపి రూ. 86.30 కోట్లకు చేరుకుందని బ్యాంకు అధికారులు అంటున్నారు. ఇక రుణం పొందిన ఏడాది తరువాత, అంటే 2014లో జూపల్లి మంత్రి అయిన తరువాత క్రిద్యా ఇన్ ఫ్రా లిమిటెడ్ అనే సంస్థకు శైలిని విక్రయించారు. శైలి ఇన్ ఫ్రా తీసుకున్న రుణాలను క్రిద్యా చెల్లించడంలో విఫలం కాగా, ఎస్బీఐ వీటిని మొండి బకాయిలుగా ప్రకటించింది.

తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయడం ద్వారా కనీసం సగం మొత్తాన్నైనా తిరిగి రాబట్టు కోవచ్చన్న ఉద్దేశంతో వాటిని విక్రయించాలని చూడగా, సదరు ఆస్తులు వివాదాల్లో ఉన్నాయని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. రిజిస్ట్రేషన్ విలువ రూ. 7.75 కోట్లుగా ఉన్న ఆస్తులను మాత్రమే వీరు తాకట్టు పెట్టారని అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువను గోల్ మాల్ చేస్తూ, అరుణ్, వరుణ్ లు బ్యాంకులను మోసం చేసి కోట్ల రుణాన్ని పొందినట్టు తేల్చారు. కిస్మత్ పూర్ లో రూ. 78.48 లక్షల మార్కెట్ విలువ ఉన్న భూమిని రూ. 3.30 కోట్ల రిజిస్ట్రేషన్ విలువగా అరుణ్ చూపించినట్టు తెలుస్తోంది. గగన్ పహాడ్ లో రూ. 1.93 కోట్ల మార్కెట్ విలు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ లో రూ. 2.5 కోట్లుగా చూపించారని అధికార వర్గాలు వెల్లడించాయి.  

ఇక ఎంతో కొంత మొత్తాన్ని వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 17.79 కోట్లుగా ఉన్న ఆస్తులను వేలానికి ఉంచగా, కేవలం ఏడు బిడ్లు మాత్రమే వచ్చాయి. వాటిల్లో అత్యధికం రూ. 2.20 కోట్లుగా ఉండటం గమనార్హం. పూర్తి మార్కెట్ విలువకు ఆ ఆస్తులను విక్రయించారనుకున్నా బ్యాంకుకు రూ. 68.51 కోట్ల నష్టం మిగులుతుంది.

అయితే, తనఖా పెట్టిన ఆస్తుల మార్కెట్ విలువను పట్టించుకోకుండా ఎస్బీఐ రుణాలిచ్చిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతుండగా, వేలానికి ఆశించిన స్పందన రాకపోవడంతో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించాలని ఎస్బీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న సీబీఐ, గత సంవత్సరంలోనే కేసు నమోదు చేసి అరుణ్ కు నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూపల్లి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News