Visakhapatnam District: సింహాచలంలో ప్రారంభమైన చందనోత్సవం.. తొలిపూజ చేసిన అశోక్ గజపతిరాజు

  • తొలిపూజ చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు
  • స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో  
  • స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకున్న మంత్రులు, ఎంపీ  రామ్మోహన్ నాయుడు, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్

విశాఖపట్టణం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలిపూజ చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఏడాది పాటు చందనంలో కనిపించే వరాహ లక్ష్మీనరసింహస్వామివారు ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విశాఖపట్టణం జిల్లా నుంచే కాకుండా సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడి చేరుకున్నారు.

ఈ  సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ, ఈరోజు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవలు జరిగాయని, రెండు గంటలకు స్వామి వారి చందన వితరణ అనంతరం అభిషేకం చేసినట్టు చెప్పారు. పంచకలశ శ్రవణం, ఆరాధన జరిగాయని చెప్పారు.

More Telugu News