Uttar Pradesh: యూపీలో కలకలం రేపిన మరో చిన్నారి హత్యాచారం!

  • వివాహానికి హాజరైన ఏడేళ్ల బాలికపై ఘాతుకం 
  • హంతకుడు షామియానాలు వేసే 19 ఏళ్ల సోనూ జాటవ్
  • నిందితుడిపై పోక్సో, ఎన్ఎస్ఏ చట్టప్రకారం కేసు 

కథువా, ఉన్నావో ఘటనలపై ఆగ్రహం చల్లారకముందే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... యూపీలోని ఎటా జిల్లాలోని అలీగంజ్ రోడ్డుపై ఉన్న మండి సమితి గేట్ వద్ద వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి ఏడేళ్ల చిన్నారి హాజరైంది. అక్కడ షామియానాలు వేసే సోనూ జాటవ్ (19) బాలికను మభ్యపెట్టి పెళ్లి వేడుకకు దగ్గర్లోని నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, తాడుతో గొంతుబిగించి హతమార్చాడు.

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ), తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎటా-ఫరూఖాబాద్ రహదారిని దిగ్బంధించారు. దీంతో సోనూ జాటవ్ ను ఎన్ఎస్ఏ (జాతీయ భద్రతా చట్టం) చట్టం కింద అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ చట్టాన్ని దేశభద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ప్రయోగిస్తారు. ఈ చట్టం కింద అరెస్టు చేస్తే అరెస్టుకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. బెయిల్ కూడా రాదు. చివరకు కోర్టులో విచారణకు కూడా హాజరుపర్చాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

More Telugu News