Chris Gayle: క్రిస్ గేల్ దుమారం ముందు చాలని ధోనీ ప్రతాపం!

  • 38 ఏళ్ల వయసులో గేల్ దూకుడు
  • 197 పరుగులు చేసిన పంజాబ్ జట్టు
  • ధోనీ రాణించినా దక్కని విజయం

క్రిస్ గేల్ దుమ్ము దుమారం ముందు మహేంద్ర సింగ్ ధోనీ దూకుడు సరిపోలేదు. ఐపీఎల్-2018లో భాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. 38 ఏళ్ల వయసులో ఇక క్రికెట్ లో అంతగా రాణించలేడేమోనని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం పక్కనబెట్టిన క్రిస్ గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే తానంటే ఏంటో చూపించాడు.

గత రాత్రి జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడి 63 పరుగులు చేసి, తన జట్టుకు శుభారంభాన్ని అందించగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 197 పరుగులు చేసింది. తొలి వంద పరుగులను 10 ఓవర్లలోపే సాధించిన ఆ జట్టు మరింత భారీ స్కోరు చేయకుండా చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. ఆపై 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో ఓపెనర్ రాయుడు చేసిన 49 పరుగులు మినహా టాప్ ఆర్డర్ రాణించలేకపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన ధోనీ 44 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో విజృంభించి 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచినప్పటికీ, జట్టు విజయతీరాలను చేరలేకపోయింది.

  • Loading...

More Telugu News