Jagan: నేనడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పకుండానే కృష్ణా జిల్లా దాటేశారు : మంత్రి ప్రత్తిపాటి

  • అమరావతికి జగన్ అనుకూలమా? వ్యతిరేకమా?
  • ఈ ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పరే?
  • జగన్ ప్రజాసంకల్పయాత్ర కారణంగా రాజధాని రైతుల భూముల విలువ తగ్గిపోయింది

‘అమరావతికి జగన్ అనుకూలమా? వ్యతిరేకమా?’ అని తానడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పకుండానే కృష్ణా జిల్లా దాటేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ నెల 21న సీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ ను ప్రత్తిపాటి ఆవిష్కరించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్, తన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని అన్నారు. అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్ కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని అన్నారు.

 గుంటూరు జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర చేయడం వల్ల రాజధాని రైతుల భూముల విలువ గజానికి రెండు నుంచి మూడు వేల రూపాయలకు తగ్గిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం ప్రతిపక్షానికి తగదని, చిత్తశుద్ధితో పోరాడుతున్న చంద్రబాబు వెనుక ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పిన ఆయన, వైసీపీకి దమ్ముంటే ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నా చేయాలని మంత్రి సవాల్ చేశారు.

More Telugu News