Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి కమలేష్ నాగర్‌కోటి అవుట్!

  • గాయాలతో ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతున్న బౌలర్లు
  • మొన్న మిచెల్ స్టార్క్, నిన్న మిచెల్ జాన్సన్, నేడు కమలేష్
  • నాగర్‌కోటి స్థానంలో ప్రసిద్ధ్‌కు అవకాశం

ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అండర్-19 పేస్ బౌలింగ్ సెన్సేషన్ కమలేష్ నాగర్‌కోటి పాదం గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి  ముందే కమలేష్‌కు గాయమైంది. దీంతో కోల్‌కతా ఫ్రాంచైజీ ప్రసిద్ధ్‌ను బ్యాకప్‌‌గా తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన 18 ఏళ్ల నాగర్‌కోటి, గాయం పెద్దది కావడంతో ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు బ్యాకప్‌గా ఉన్న ప్రసిద్ధ్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది.

కర్ణాటక తరపున 2015లో ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో అడుగిడిన ప్రసిద్ధ్ మొత్తం 19 లిస్ట్-ఎ మ్యాచుల్లో 33 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ ప్రారంభానికి ముందు నుంచే కోల్‌కతాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వెన్నుపూస గాయంతో జట్టుకు దూరం కాగా, మిచెల్ జాన్సన్ కూడా గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు కమలేష్ నాగర్‌కోటి కూడా దూరం కావడం జట్టును వేధిస్తోంది.

More Telugu News