crime: మోదీ ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ కులాలపై విపరీతంగా పెరిగిన దాడులు.. వెల్లడించిన జాతీయ నేర విభాగం

  • యూపీఏతో పోలిస్తే శిక్షలు పడుతున్న వారూ తక్కువే
  • షెడ్యూల్డ్ కులాలపై జరుగుతున్న దాడుల్లో యోగి ప్రభుత్వానిది అగ్రస్థానం
  • నేరస్తుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ కులాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. 2011-13లో షెడ్యూల్డ్ కులాలపై 1,06,782 నేర ఘటనలు జరగ్గా 2014-16లో ఆ సంఖ్య 1,19,872కు చేరినట్టు ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించింది. అంతేకాదు, ఎన్డీయే హయాంతో పోలిస్తే యూపీఏ హయాంలో శిక్షల రేటు కూడా ఎక్కువేనని తేల్చింది. అంటే నేరాలు పెరగడంతోపాటు నేరస్తులకు శిక్షల విషయంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు అర్థం అవుతోంది.

2011లో 32 శాతం కేసుల్లో నిందితులను దోషులుగా తేల్చగా, 2012-13లో అది 24 శాతానికి పడిపోయింది. ఇక ఎన్డీయే హయాంలో 2014లో 24.5 శాతం, 2016లో 25.5 శాతం, 2017లో 25.7 శాతం మంది మాత్రమే దోషులుగా తేలారు. ఇక 2014-15లో షెడ్యూల్డ్  కులాలపై నేరాల సంఖ్య 4.3 శాతం తగ్గగా, 2015-16లో తిరిగి 5.5 శాతానికి పెరిగింది.

షెడ్యూల్డ్ కులాలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. 2016లో ఇక్కడ మొత్తం 10,426 కేసులు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఇది 25.6 శాతం. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, కేరళ ఉన్నాయి.

More Telugu News