Kathua: కశ్మీర్‌లో కఠువా అత్యాచార చిచ్చు.. కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రుల ఔట్!

  • కశ్మీర్‌లో భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చు
  • బీజేపీకి సీఎం మెహబూబా అల్టిమేటం
  • దిగొచ్చిన బీజేపీ.. మంత్రుల రాజీనామా

దేశాన్ని ఊపేస్తున్న కఠువా అత్యాచార వ్యవహారం చివరికి కశ్మీర్‌లో ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామాకు దారి తీసింది. ఈ వ్యవహారం అధికార భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చురేపింది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అల్టిమేటంతో బీజేపీ దిగొచ్చింది. చివరికి ఇద్దరు మంత్రులు లాల్ సింగ్, చంద్రప్రకాశ్ గంగాతో రాజీనామా చేయించింది. కఠువా ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు. మరోవైపు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పీడీపీ భావిస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు నేడు కీలక నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేసింది.  

నిజానికి బీజేపీతో విడిపోవడమే మేలని పీడీపీ ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఈ విషయాన్ని ముఫ్తీ సోదరుడు, రాష్ట్ర మంత్రి తషదూక్ ముఫ్తీ చూచాయగా చెప్పేశారు. ప్రధాని మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కఠువా ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే హిందూ ఏక్తా మంచ్ అనే హిందూత్వ సంస్థ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడాన్ని పీడీపీ తీవ్రంగా పరిగణించింది.

ఇది తమ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రమాదం ఉందన్న భావనకు వచ్చిన సీఎం ముఫ్తీ నష్ట నివారణ చర్యల్ని ప్రారంభించారు. అందులో భాగంగానే ఆ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయిస్తారా? లేక కేబినెట్ నుంచి తొలగించమంటారా? అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో దిగి వచ్చిన బీజేపీ అధిష్ఠానం ఆ ఇద్దరితో రాజీనామా చేయించింది.  

More Telugu News