Telugudesam: ఇక కన్ఫార్మ్... రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ నేత యలమంచిలి రవి

  • గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న యలమంచిలి రవి
  • టీడీపీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణ
  • ఇంతకాలం ఓపికతో చూశానని వెల్లడి
తెలుగుదేశం పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరడం ఖాయమైంది. చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వినని రవి, రేపు వైకాపా అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే నేడు స్వయంగా మీడియాకు తెలిపారు.

తాను ఎవరినీ విమర్శించడం లేదని, తన వెంట ఉన్న కార్యకర్తల అభీష్టం మేరకే జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తన రాకతో ఇప్పటికే విజయవాడలో ఉన్న ఏ పార్టీ నేతకూ ఇబ్బంది కలుగదనే భావిస్తున్నానని చెప్పారు. టీడీపీలో గౌరవం దక్కలేదు కాబట్టే పార్టీని మారుతున్నానని, 2014లో తాను సిట్టింగ్ ఎమ్మెల్యేను అయినప్పటికీ, సీటు ఇవ్వకుండా అవమానించారని, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తాను ఓపికగా ఇంతకాలం ఎదురు చూసి విఫలం అయ్యానని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ లు తనకు బాధను కలిగించాయని యలమంచిలి రవి చెప్పారు. హోదాపై జగన్ చేస్తున్న ఉద్యమం పటిష్ఠంగా ఉందని, ప్రజలు జగన్ ను నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.
Telugudesam
YSRCP
Andhra Pradesh
Chandrababu
Yalamanchili ravi
Jagan

More Telugu News