ICICI: విచారణలో దీపక్ కొచ్చర్ సమాధానాలపై సంతృప్తి చెందని ఐటీ శాఖ!

  • నూ పవర్ కు మారిషస్ కంపెనీల నుంచి నిధులు
  • ఎలా వచ్చాయన్న ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వని దీపక్ కొచ్చర్
  • మరింత వివరణ కోరిన ఐటీ శాఖ

ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చంద కొచ్చర్ భర్త, నూ పవర్ రెన్యూవబుల్స్ వ్యవస్థాపక డైరెక్టర్ దీపక్ కొచ్చర్, మారిషస్ నుంచి నిధులను ఎలా తెచ్చారన్న విషయమై ప్రశ్నించిన ఐటీ శాఖ, సంతృప్తికరమైన సమాధానాలను రాబట్టలేకపోయిందని తెలుస్తోంది. రూ. 325 కోట్లు మారిషస్ కేంద్రంగా నడుస్తున్న కంపెనీల నుంచి నూ పవర్ కు రాగా, వాటిని ఎలా ఆకర్షించగలిగారన్న కోణంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.

ఈ మేరకు దీపక్ కొచ్చర్ కు ఐటీ శాఖ నోటీసులు పంపగా, దీపక్ నుంచి వచ్చిన సమాధానం సరిగ్గా లేదని భావించిన అధికారులు, మరిన్ని వివరణలు తక్షణం అందించాలని సూచించారు. కాగా, వీడియోకాన్ కు రూ. 3,250 కోట్ల రుణాలను ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన తరువాత క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మారిషస్ లోని ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్, డీహెచ్ రెన్యూవబుల్ హోల్డింగ్స్ సంస్థల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు నూ పవర్ కు రాగా అంత మొత్తాన్ని ఆ సంస్థలు ఎందుకు పెట్టుబడి పెట్టాయన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు ఐటీ అధికారులు

More Telugu News