High Court: రూ.. 7.5 లక్షలు తీసుకుని డ్రగ్స్ కేసు నిందితునికి బెయిల్... న్యాయమూర్తిపై కేసు

  • డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ దత్తు
  • బెయిల్ ఇచ్చేందుకు రూ. 11 లక్షలు డిమాండ్
  • చివరకు రూ. 7.5 లక్షలకు కుదిరిన బేరం
  • తీవ్రంగా పరిగణించిన హైకోర్టు

ఓ డ్రగ్స్ కేసు నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు హైదరాబాద్ ఒకటో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తి రూ. 7.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గత అర్ధరాత్రి నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఆయన డబ్బు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ.

డబ్బిచ్చి తాను బెయిల్ తెచ్చుకున్నానని బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, హైకోర్టు దీన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి, రాధాకృష్ణమూర్తిపై కేసు నమోదు చేశారు. ఆపై ఆల్వాల్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

గత సంవత్సరం ఓ నైజీరియన్ తో కలసి దత్తు అనే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ ఇచ్చేందుకు రూ. 11 లక్షలను రాధాకృష్ణ మూర్తి డిమాండ్ చేశారని, చివరకు రూ. 7.5 లక్షలకు బేరం కుదిరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఈ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చాయని, ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపైనా సోదాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

More Telugu News