Andhra Pradesh: ప్రజలు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేసిన శాఖల అధికారులకు లేఖలు రాయండి: ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్

  • ప్రభుత్వ పథకాలపై వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష
  • ఆయా శాఖల పని తీరులో మార్పు రాకపోతే బాధ్యులపై చర్యలు
  • ఆర్టీజీ సీఈఓకు సీఎస్ ఆదేశాలు

ప్రజలు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేసిన శాఖాధికారులకు లేఖలు రాయాలని రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సీఈఓ బాబు.ఏ ను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పథకాలపై వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఈరోజు సమీక్షించారు.

వివిధ పథకాలపై ప్రజలు అడిగే ప్రశ్నలు, వివిధ రకాల పింఛన్లు, గృహ నిర్మాణ, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు వంటి పథకాలకు వచ్చిన దరఖాస్తులు, ఆ పథకాలకు అర్హులు, అత్యంత అర్హత కలిగినవారు, అనర్హులు, ఇళ్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేయడం, కొత్త రేషన్ కార్డుల జారీ, గతంలో ఇళ్లు పొందినవారు కూడా మళ్లీ దరఖాస్తు చేయడం వంటి అనేక అంశాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఏ అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఆ అంశాలను వివరిస్తూ, ఇక ముందు వారి సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా లేఖలలో ప్రస్తావించాలని ఆదేశించారు. భవిష్యత్ లో ఆయా శాఖల పని తీరులో మార్పు రాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేయమని సీఎస్ చెప్పారు.

కాగా, వివిధ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు బాబు వివరించారు. 19 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 34 పథకాలపై ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెర్సాన్ సిస్టం) ద్వారా సమాచారం సేకరించి ప్రజల సంతృప్తి స్థాయిని గణిస్తున్నట్లు బాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద వివిధ పథకాలకు సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయి జనవరిలో 62 శాతం, ఫిబ్రవరిలో 61 శాతం, మార్చిలో 66 శాతం, ఏప్రిల్ లో ఇప్పటి వరకు 70 శాతం ఉన్నట్లు వివరించారు.

మార్చి నెలలో పెన్షన్ పథకాలపై 78 శాతం మంది, ఆరోగ్య పథకాలపై 75 శాతం, పౌరసరఫరాల విభాగంపై 74 శాతం, పవర్ పై 72, రోడ్లు భవనాల శాఖపై 67 శాతం, అర్బన్ హౌసింగ్ పై 62, సంక్షేమ శాఖపై 57 శాతం, గ్రామీణ గృహ నిర్మాణ పథకంపై 51 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News