Telangana: తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి : మంత్రి కడియం శ్రీహరి

  • గురుకులాలన్నింటిలో ఉమ్మడి పరీక్షా విధానం
  • కామన్ మెనూ, వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలి
  • విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలి

తెలంగాణ గురుకులాలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులాలుగా తీర్చిదిద్దాలని, వాటిని దేశానికి రోల్ మోడల్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల సొసైటీల కార్యదర్శులు, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, విద్యాశాఖ సంచాలకులు కిషన్, ఇతర అధికారులతో ఈరోజు సమీక్షించారు.

సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో గురుకుల విద్యాలయాల పటిష్టతపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకులాలు దేశంలో మంచి పేరు సంపాదించాయని, ఇదే విధానాన్ని కొనసాగించాలని గురుకులాలను పటిష్టం చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ లలో తెలంగాణ గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని ఆకాంక్షించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలన్నింటిలోనూ ఒకే రకమైన మెనూను ఇప్పటికే అమలు చేస్తున్నామని, దీనిని మరింత పకడ్బందీగా నిర్వహించాలని కడియం శ్రీహరి సూచించారు. గురుకులాలన్నింటికీ ఒకే పరీక్ష విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ వేసవి సెలవుల్లో ప్రతి విద్యా సంస్థను ప్రత్యేకంగా పర్యవేక్షించి అక్కడి వసతులను మెరుగు పర్చాలని ఆదేశించారు. కిరాయి భవనాల్లో కూడా వసతులు కల్పించాలని, ఏవైనా మరమ్మతులు అవసరముంటే  వెంటనే చేయాలని, విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని ఆదేశించారు.

బాలికలకు న్యాప్కిన్స్ సరిపడా ఇవ్వాలని, పది నెలలకు కాకుండా 12 నెలలకు సప్లయ్ చేయాలని, చాలామంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రక్తహీనత ఉన్న బాలికలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని సూచించారు. ఇక ప్రతి గురుకులంలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని, ఒక ఏఎన్ఎం ఉండాలని, అదేవిధంగా క్రీడలు, ఆటలు ప్రోత్సహించేందుకు పీఈటీ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి గురుకుల విద్యాలయంలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, ఐదు గురుకులాల్లో కల్పించే వసతులు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆయన సూచించారు. గురుకులాల ప్రవేశాల్లో కూడా నియోజక వర్గాల్లోని స్థానికులకు కొంత ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారని, దానిని దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని, కొత్త జిల్లాలను యూనిట్ గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహిస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని అన్నారు. 

  • Loading...

More Telugu News