Fake News: ఫేక్‌న్యూస్ కేన్సర్‌లా విస్తరిస్తోంది.. సర్జరీ చేయాల్సిందే!: సుబ్రహ్మణ్యస్వామి

  • ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకూ ఓ హద్దు ఉండాలి 
  • అది ఎక్కడ అన్నదే ప్రభుత్వం ముందున్న సవాలు
  • మీడియాలో పోటీతత్వమే ఫేక్ న్యూస్ విస్తరణకు కారణం

సమాజంలో ‘ఫేక్ న్యూస్’ కేన్సర్‌లా విస్తరిస్తోందని, దానికి సర్జరీ అవసరమని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దక్షిణాసియా బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలంబియా స్కూల్ ఆతిథ్యంలో నిర్వహించిన 14వ వార్షిక ఇండియా బిజినెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫేక్‌న్యూస్ కేన్సర్ మహమ్మారిలా విస్తరిస్తోందని, దానికి సర్జరీ చేసి నియంత్రించాల్సిన అవసరం ఉందని స్వామి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా  కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. అయితే, ఆ పరిధిని ఎలా నిర్ణయించాలన్నదే ప్రభుత్వానికి ఇప్పుడు పెను సవాలుగా మారిందన్నారు. మీడియా ఇప్పుడు మాస్ మీడియాగా మారిపోయిందన్న స్వామి సైబర్  ప్రపంచం కారణంగా ఓ వార్త తక్షణం అత్యంత వేగంగా పాకిపోతోందన్నారు.

మీడియాలో పోటీతత్వం పెరగడమే ఫేక్‌న్యూస్‌కు కారణమన్నారు. జర్నలిస్టులు ఫేక్‌న్యూస్‌ను రాస్తారని తాను భావించడం లేదని, రాజకీయ శత్రువులు ఒకరిపై మరొకరు బురద జల్లుకునే క్రమంలో ఇటువంటి వార్తలు పుట్టుకొస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎవరైనా మరొకరిపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా సంస్థలు దానిని ప్రచురించేటప్పుడు అవతలి వ్యక్తి ఖండనను కూడా వేస్తే  అసలు ఈ గొడవే ఉండదని స్వామి పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అది అవతలి వ్యక్తి కీర్తి ప్రతిష్ఠలను దెబ్బ తీసే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

More Telugu News