honda e scooters: భారత మార్కెట్ కు ఈ- స్కూటర్లను తీసుకురానున్న హోండా

  • జపాన్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనులు
  • చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం
  • వెల్లడించిన హోండా భారత విభాగం సీఈవో మినోరు కటో

దేశ ద్విచక్ర వాహన మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న జపాన్ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా, ఎలక్ట్రిక్ స్కూటర్ల (ఈ-స్కూటర్ల) అభివృద్ధిని ప్రారంభించింది. కాలుష్య నివారణకు వీలుగా పర్యావరణ అనుకూల వాహనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురావాలనుకుంటోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల అభివృద్ధి పనులు జపాన్ లోని కంపెనీ ప్రధాాన కార్యాలయంలో జరుగుతాయని భారత విభాగం సీఈవో మినోరు కటో తెలిపారు.

అవసరమైన వివరాలను భారత విభాగం నుంచి తీసుకోవడం జరిగిందన్నారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో అనుభవం ఉన్నప్పటికీ భారత కస్టమర్ల అభిరుచులను అందుకోవడం కష్టమైన పనిగా కటో పేర్కొన్నారు. ధర, వాహన శ్రేణి, పనితీరు పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే విధంగా బ్యాటరీ సామర్థ్యం ఉండాలని లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎప్పటిలోగా మార్కెట్ అందించగలరన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. 

More Telugu News