Karnataka: మైసూరులో అమిత్ షా పర్యటనకు చుక్కెదురు!

  • రోడ్డుపై బైఠాయించిన దళితులు
  • ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తున్నారని విమర్శ
  • ఆ ప్రాంతానికి రాకుండానే వెళ్లిపోయిన అమిత్ షా

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు ప్రాంతంలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దళితుల నుంచి చుక్కెదురైంది. దళితులు, క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని ఆపడంలో కేంద్రం విఫలమవుతోందని, దేశ జనాభాలో 30 శాతం ఉన్న దళితులు మరింత పేదలుగా మారిపోతున్నారని, అంటరానివారుగా ఉన్నారని ఆరోపిస్తూ, పలువురు అమిత్ షాను అడ్డుకున్నారు.

 తాజాగా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే చర్యలను కేంద్రం ప్రారంభించిందని ఆరోపిస్తూ, తమ విషయంలో కేంద్రం ఏం చేయాలనుందో చెప్పాలని నినాదాలు చేశారు. అడుగడుగునా తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాగా, దళితులు రోడ్డుపై బైఠాయించారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న అమిత్ షా, ఆ ప్రాంతంలో జరపాల్సిన తన రోడ్ షోను రద్దు చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు. కాగా, కర్ణాటకలో 19 శాతం దళితులు ఉండగా, 224 సీట్లున్న అసెంబ్లీలో 60 స్థానాల్లో జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో దళిత, క్రైస్తవ ఓటర్లు ఉన్నారు.

More Telugu News