Krishna Express: పట్టాలెక్కిన వైకాపా కార్యకర్తలు... ఏపీలో రైళ్ల రాకపోకలకు అవాంతరం!

  • ప్రత్యేక హోదా కోసం నేడు రైల్ రోకో
  • వెంకటగిరిలో ఆగిన కృష్ణా ఎక్స్ ప్రెస్
  • గుంతకల్లులో నిలిచిన కర్ణాటక ఎక్స్ ప్రెస్
  • స్టేషన్లలో భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ, ఈ ఉదయం రైల్ రోకోకు ఆ పార్టీ పిలుపునివ్వగా, పలు ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు రైళ్లను అడ్డుకుంటున్నారు. గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల్లో పట్టాలపైకి చేరిన వైకాపా కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. గుంతకల్లులో ఓ ప్యాసింజర్ రైలును శివారుల్లోనే వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గుంతకల్ జంక్షన్ లో కర్ణాటక ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి నుంచి వస్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను ప్రధాన స్టేషన్లలో నిలిపినట్టు తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షించిన తరువాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్ల వద్ద భద్రతను పెంచామని అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీలో జరుగుతున్న వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీల దీక్షను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

More Telugu News