యూఎస్ సెనేట్ విచారణలో మార్క్ జుకర్ బర్గ్ నోట 'ఇండియాలో ఎలక్షన్స్' ప్రస్తావన!

11-04-2018 Wed 08:58
  • యూఎస్ కాంగ్రెస్ ముందు రెండో రోజు విచారణ
  • విచారణకు హాజరై వివరణ ఇచ్చిన మార్క్
  • ఇండియాలో ఒక్కో రాష్ట్రం బ్రిటన్ అంత పెద్దది
  • యూజర్ల సమాచారంపై మరిన్ని జాగ్రత్తలు

కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఫేస్ బుక్ ఖాతాల్లోని సమాచారం చోరీ అయిందన్న ఆరోపణలపై వరుసగా రెండో రోజు యూఎస్ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరైన ఆ సంస్థ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్, జరిగిన తప్పిదానికి మరెవరినీ బాధ్యులను చేయాల్సిన అవసరం లేదని, తప్పంతా తనదేనని చెబుతూ మరోసారి క్షమాపణలు కోరాడు. అమెరికా ఎన్నికలను ఫేస్ బుక్ ప్రభావితం చేసిందన్న ఆరోపణలను ప్రస్తావించిన కాంగ్రెస్ సభ్యులు ఇతర దేశాల్లో జరిగే ఎన్నికల సంగతేంటని ప్రశ్నించిన వేళ, మార్క్ ఇండియాలో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలను ప్రస్తావించారు.

ఇండియా సహా పలు దేశాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించిన ఆయన, ఈ ఎన్నికల్లో ఫేస్ బుక్ లోని సమాచారం దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని తెలిపారు. "2018 సంవత్సరం మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ఇండియా, పాకిస్థాన్ వంటి ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సురక్షితంగా జరిగేందుకు చేయాల్సిందంతా చేస్తాం" అని జుకర్ బర్గ్ తెలిపారు. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న పొలిటికల్ కన్సల్టెంట్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ యూజర్ల డేటాను హైజాక్ చేసిన తరువాత ఫేస్ బుక్ పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే.

ఇండియాలోని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమ క్లయింట్లేనని, ఆ దేశంలోని ఫేస్ బుక్ యూజర్ల డేటా తమ వద్ద ఉందని, ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇండియాలో ఆఫీసులను కూడా నడుపుతున్నామని కేంబ్రిడ్జ్ అనలిటికా మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్ వైలీ బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటించిన తరువాత ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన మార్క్ కాంగ్రెస్ పార్టీ కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ క్లయింటన్న సంగతి తనకు తెలుసునని, అయితే, ఇండియా చాలా పెద్ద దేశమని, ఓ రాష్ట్రం బ్రిటన్ అంత ఉంటుందని, ఇండియా ఫేస్ బుక్ యూజర్లను ప్రభావితం చేయలేదనడానికి తన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని, అవసరమని భావిస్తే వాటిని యూఎస్ కాంగ్రెస్ ముందు ఉంచుతానని అన్నారు.