MSRTC bus: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసి బస్సును ఎత్తుకెళ్లిన ఘనుడు!

  • ఇంటికి వెళ్లేందుకు బస్సును ఎత్తుకెళ్లిన యువకుడు
  • బస్సుపై నియంత్రణ కోల్పోయి మూడు నిమిషాలకే చెట్టుకు ఢీ
  • చితకబాదిన ప్రయాణికులు

కాదేదీ దొంగతనానికి అనర్హం అనుకున్నాడో ఏమో.. ఏకంగా ప్రయాణికులతో నిండి ఉన్న ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడో ప్రబుద్దుడు. ముంబైలో జరిగిందీ ఘటన. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సబీర్ అలీ మన్సూరి (31) ముంబై నుంచి తన స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్‌లోని ఫల్ఘర్ వెళ్లాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా మంగళవారం ఉదయం బోయిసర్ బస్ డిపోకు చేరుకున్నాడు.

అక్కడ బోయిసర్ నుంచి తన స్వగ్రామమైన ఫల్ఘర్ వెళ్లే బస్సు కనిపించింది. అప్పటికే అది ప్రయాణికులతో నిండి ఉండగా డ్రైవర్ మాత్రం కనిపించలేదు. ఇదే అదనుగా భావించిన మన్సూర్ వెంటనే బస్సెక్కి ముందుకు పోనిచ్చాడు. బస్సు డిపో నుంచి బయటకు వచ్చిన మూడు నిమిషాలకే నియంత్రణ కోల్పోయిన మన్సూర్ మెయిన్ రోడ్డుపై ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలు విషయం తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికులు మన్సూరును పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇంటికి వెళ్లేందుకు బస్సును దొంగిలించాలని నిర్ణయించుకున్నానని మన్సూర్ పోలీసులకు తెలిపాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు మాత్రం అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రస్తుతం చికిత్స జరుగుతోందని చెప్పారు.

బస్సు కేబిన్ డోర్‌ను లాక్ చేయకుండా వదిలి వెళ్లిన డ్రైవర్‌పై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎంఎస్ఆర్టీసీ సీపీఆర్వో అభిజిత్ భోసాలె తెలిపారు.

  • Loading...

More Telugu News