Andhra Pradesh: ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీలో జాప్యమొద్దు: సీఎస్ దినేష్ కుమార్ ఆదేశం

  • గిరిజన ప్రాంతాలను దత్తత తీసుకోండి
  • ప్రతి నెల మాతా శిశువులు, గర్భిణులు, బాలికల హెల్త్ రిపోర్టులు
  • పౌష్టికాహారం పంపిణీకి నిధుల కొరత లేదు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని, కార్డుల జారీ చేసే విషయంలో జాప్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలో మాతా శిశు వైద్య పథకాలు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద అమలు చేస్తున్న ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పై ఆయా శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 15,36,719 ఉద్యోగుల హెల్త్ కార్డులు అందజేశామని, మరో 2,01,069 మందికి త్వరలో అందజేయనున్నట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు రాకపోవడం వల్లే కార్డుల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటోందని వివరించారు.

సీఎస్ దినేష్ కుమార్ స్పందిస్తూ, తక్షణమే ఉద్యోగుల పేర్లు, ఇతర వివరాలు అందజేయాలని ఆర్థిక శాఖాధికారులను ఆదేశించారు. హెల్త్ కార్డులో ప్యాకేజీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంవత్సర ఆరోగ్య పరీక్షల ప్యాకేజీల మొత్తం కేంద్ర ప్రభుత్వ ధరలతో సమానంగా ఉండాలని ఆదేశించారు. ఆయుష్మానుభవ ఆరోగ్య పథకం కింద లబ్ధిదారుల ఎంపిక గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ యోజన పథకం అమలులో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కించుకుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కమిషనర్ పూనం మాలకొండయ్య తెలపగా, దినేష్ కుమార్ అభినందనలు తెలిపారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రాష్ట్రంలో ఉన్న15 గిరిజన మండలాల్లో ఉన్న బాలింతలు, గర్భిణులు, శిశువులతో పాటు బాలబాలికల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. మన్యంలోని గర్భిణులు, బాలింతలు, బాలికల్లో రక్తహీనత, బీపీ తదితర ఆరోగ్య స్థితిగతులపైనా, పౌష్టికాహారం పంపిణీపైనా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా వారికి అందేలా చూడాలని, నిధుల కొరత లేదని, పౌష్టికాహారం అందజేయడంలో నిర్లక్ష్యం చూపొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. మన్యంలోని గర్భిణులు, బాలింతలు, బాలికల ఆరోగ్య రక్షణ నిమిత్తం గిరిజన మండలాలను దత్తత తీసుకోవాలని, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, దాతలను చైతన్యపర్చాలని, వారితో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా ముందుకు రావాలని కోరారు.

గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, హిమోగ్లోబిన్ శాతం, బీపీ వంటి వివరాలతో కూడిన రిపోర్టులు తయారు చేయాలని, చిన్నారుల ఎత్తు, బరువుపైనా నివేదికలు రూపొందించాలని, అంగన్ వాడీ కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని, ఇలా ప్రతి నెలా రిపోర్టులు తయారు చేసి, వాటిని ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఈ రిపోర్టులు రూపొందించాలని, ఈ రెండు శాఖలు రిపోర్టులు ఒకేలా ఉండాలని, ఎక్కడా వ్యత్యాసం రాకూడదని హెచ్చరించారు. వచ్చే నెల ఒకటో తేదీన మొదటి రిపోర్టు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలని, మాతా శిశు ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

 ప్రతి గర్భిణికి మెటర్నరీ హెల్త్ కార్డు అందజేస్తాం

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల్లో గర్భిణుల నమోదు ప్రక్రియ అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు నమోదు చేస్తారని చెప్పారు. ప్రతి గర్భిణికి మెటర్నరీ హెల్త్ కార్డు అందజేస్తామని, ఆ కార్డు ఆధారంగా నెలవారీ వైద్య పరీక్షలు చేస్తామన్నారు. గర్భిణిలో హిమోగ్లోబిన్ శాతం, బీపీ, ఆమె బరువు వివరాలతో పాటు 9 నెలల కాలంలో నాలుగు రకాల పరీక్షలతో పాటు ఇతర వైద్య సేవలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపరుస్తామని, ప్రసవానంతరం కూడా బాలింతతో పాటు శిశువు ఆరోగ్య రక్షణకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

కాగా, బాలింతలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య రక్షణకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత వెల్లడించారు. మన్యంలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు న్యూట్రి బాస్కెట్ ల పేరుతో పౌష్టికాహారం అందజేస్తున్నట్టు చెప్పారు. 

  • Loading...

More Telugu News