whatsapp: వాట్సాప్ లో లీకవుతున్న కీలక సమాచారం... ఫేస్ బుక్, ఇతర సంస్థలకు చేరవేత!

  • పేమెంట్స్, ఇతర వ్యక్తిగత వివరాలు లీక్
  • థర్డ్ పార్టీలతో పంచుకుంటున్నట్టు ఒప్పుకున్న వాట్సాప్
  • యూజర్ల భద్రత, గోప్యతకు భంగకరం

సమాచార వారధి వాట్సాప్ ను వాడే వారిని, వాట్సాప్ పేమెంట్స్ సేవలు వినియోగించుకునే వారిని ఆందోళనకు గురిచేసే సమాచారం వెలుగు చూసింది. వాట్సాప్ లో చెల్లింపుల సమాచారం ఫేస్ బుక్ కు వెళుతోందట. ఈ విషయాన్ని ఎవరో దారినపోయే దానయ్య చెప్పలేదు. స్వయంగా వాట్సాప్ సంస్థే యూజర్ల చెల్లింపుల సమాచారం ఫేస్ బుక్ తో పంచుకుంటున్నట్టు చెప్పింది. యూపీఐ ఆధారిత చెల్లింపులను వాట్సాప్ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఈలోగా ఈ నిజం వెలుగు చూసింది. ‘‘థర్డ్ పార్టీ ప్రొవైడర్లతో సమాచారాన్ని పంచుకుంటున్నాం. మీ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలు, మీరు వాడుతున్న ఫోన్ వివరాలు, వీపీఏ (వర్చువల్ పేమెంట్ అడ్రస్), పంపించేవారి యూపీఐ పిన్, చెల్లింపుల సమాచారం ఇస్తున్నాం’’ అని నివ్వెరపరిచే నిజాలను వాట్సాప్ వెల్లడించం గమనార్హం. నిజానికి వర్చువల్ పేమెంట్ అడ్రస్, పిన్ అన్నవి చాలా సున్నితమైనవి, కీలకమైనవి అని తెలిసిందే. ఇటీవలే ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలైటికా సంస్థ చోరీ చేయడం గుర్తుండే ఉంటుంది. వాట్సాప్ ఫేస్ బుక్ అనుబంధ సంస్థ. పేమెంట్స్ సమాచారాన్ని ఫేస్ బుక్ లో పెడితే యూజర్ల గోప్యత ప్రశ్నార్థకమే అవుతుంది. 

More Telugu News