shahid afridi: భారత్‌పై అఫ్రిది విషం చిమ్మడం వెనకున్నఅసలు కారణం ఇదే

  • రాజకీయ అరంగేట్రానికి అఫ్రిది తహతహ
  • ఇప్పటికే పలుమార్లు షరీఫ్‌తో భేటీ
  • దేశ విభజన నుంచే భారత్ అంటే ద్వేషం పెంచుకున్న అఫ్రిదీలు
భారత్ ఆక్రమిత కశ్మీర్.. అంటూ పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇటీవల భారత్‌పై విషం చిమ్మడం వెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్ అదరహో అని కొనియాడిన ఆఫ్రిది.. తాజాగా ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ బెటరని వ్యాఖ్యానించాడు. భారత్‌పై అఫ్రిది అక్కసు వెళ్లగక్కడం వెనక చాలా కారణాలు ఉన్నాయి.

వరసకు సోదరుడయ్యే అఫ్రిది సమీప బంధువు షకీబ్ ఉగ్రవాది. 2003లో అనంతనాగ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ అతడిని హతమార్చింది. పాక్‌లోని పెషావర్‌కు చెందిన షకీబ్ అనంతనాగ్ వచ్చి ‘హర్కత్ ఉల్ అన్సార్’ అనే ఉగ్రవాద సంస్థలో ఏడాదిన్నరపాటు కమాండర్‌గా పనిచేశాడు. షకీబ్ గురించి ఓసారి అఫ్రిదిని అడిగితే తమది చాలా పెద్ద కుటుంబమని, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పి తప్పించుకున్నాడు.

1947లో అప్పటి పాక్ సైనికాధికారి అక్బర్ ఖాన్ నేతృత్వంలో గిరిజనులైన అఫ్రిదీ, వాజీర్, మసూద్, తెరి తెగలు కశ్మీర్‌పై దండెత్తాయి. అఫ్రిదీలు దోపిడీలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. వీరి ఆగడాలను భరించలేని కశ్మీర్ రాజు హరిసింగ్ భారత్‌ను ఆశ్రయించడంతో భారత దళాలు రంగంలోకి దిగి వారిని తరిమికొట్టాయి. దీంతో అఫ్రిదీ తెగ భారత్‌పై ద్వేషం పెంచుకుంది. అది ఇప్పటికీ షాహిద్ అఫ్రిది మాటల్లో బయటపడుతూనే ఉంది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు రెండేళ్ల క్రితం భారత్ వచ్చినప్పుడు కూడా కశ్మీర్‌పై కారుకూతలు కూశాడు.  

కశ్మీర్ విషయంలో అఫ్రిది నోరు పారేసుకోవడం వెనక అసలు కథ రాజకీయమేనని తెలుస్తోంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ (ఎన్)లో అఫ్రిది చేరనున్నట్టు తెలుస్తోంది. షరీఫ్‌తో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన అఫ్రిది వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడన్నది తాజా సమాచారం. కశ్మీర్‌ గురించి మాట్లాడడం ద్వారా పాక్ ప్రజలకు దగ్గర కావచ్చన్న దుష్ట ఆలోచనతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెబుతున్నారు. క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ తరహాలో వెలిగిపోవాలని తహతహలాడుతున్నాడు.
shahid afridi
Pakistan
India
Jammu And Kashmir
Cricket

More Telugu News