raghuveera reddy: చంద్రబాబు అవినీతి పాలనతో రాష్ట్రం అధోగతి పాలు: ర‌ఘువీరారెడ్డి

  • చంద్రబాబుది అసమర్థ పాలన 
  • రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ తీరు సక్రమంగా లేదు
  • వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ రెండూ అస్తవ్యస్తంగా ఉన్నాయి
  • ఈ విషయాలను కాగ్ తెలుపుతూ తప్పు పట్టింది

తన అసమర్థ, అవినీతి పాలన ద్వారా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఏపీని అధోగతి పాలు చేశారని కాగ్ రిపోర్టు ద్వారా రుజువైందని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. "రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ తీరు సక్రమంగా లేదని, వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ రెండూ అస్తవ్యస్తంగా ఉన్నాయని కాగ్ తప్పు పట్టింది. వినియోగ ధ్రువ పత్రాలు (UC), ఖర్చుల వివరాలు లేకుండా హడావుడిగా నిధులు ఖర్చు చేస్తున్నారని కాగ్ ఎత్తి చూపింది. దీనివల్ల పారదర్శకత లోపించి రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది.

చంద్రబాబు కుటుంబం, మంత్రులు విపరీతంగా దోచుకుంటూ తమ సొంత వారికి, పార్టీ నాయకులకు దోచి పెడుతున్నారు. కొన్నిచోట్ల అడ్డగోలుగా కేటాయింపులకు మించి ఖర్చు చేసి, మరి కొన్ని చోట్ల కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేదని కాగ్ బయట పెట్టింది. దీనివల్ల ప్రాధామ్య అంశాలకు నిధుల లభ్యత లేకుండా చేశారని కాగ్ అభిప్రాయ పడింది. ఇందువల్ల విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కుంటు పడిందని మేము పదే పదే చెబుతోన్న‌ విషయాలను కాగ్ ధ్రువీకరించినట్లయింది.

మొత్తం ఖర్చులో సామాజిక రంగానికి చేసిన ఖర్చు కేవలం 4.62 శాతం మాత్రమే అంటే ఈ ప్రభుత్వానికి పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేట తెల్లమవుతుంది. అప్పులు తెచ్చి మరీ అవినీతికి, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కాగ్ రిపోర్టు ద్వారా వెల్లడయింది. రాష్ట్రంపై ఉన్న రుణ భారం 2,22,845 కోట్ల రూపాయలుగా తేల్చింది. విభజన నాటికి మనకు వచ్చిన అప్పుల వాటా 96,000 కోట్లు. అంటే ఈ మూడున్నర ఏళ్ల లో 1,26,845 కోట్లు అప్పు చేస్తే.. తీరా చేసిన అభివృద్ధి శూన్యం. ఇష్టానుసారం విచ్చలవిడిగా ఈవెంట్ మేనేజ్ మెంట్లకు ఖర్చు చేసి, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కుంటు పడేలా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు చంద్రబాబు.

ఈ అప్పులు తీర్చాలంటే రాష్ట్రంపై ఎంత భారమో ఆలోచించండి. ప్రాజెక్టుల అంచనాలను అమాంతం పెంచేసి ఘోరమైన అవినీతికి పాల్పడినట్లు అర్థ‌మవుతుంది. ఒక్క నీటిపారుదల శాఖలోనే 27,467 కోట్ల రూపాయల అంచనాల పెంపు జరిగినా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాని వైనాన్ని, ప్రభుత్వం ఆర్థిక ఫలితాలు వెల్లడించని తీరును కాగ్ తప్పు పట్టింది. నీటిపారుదల రంగంలో అవినీతి పరాకాష్టకు చేరిందని మేము చెబుతున్న విషయం నిజమని రుజువయ్యింది.

మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలలో కోట్లాది నిధుల దుర్వినియోగం, జాతీయ తాగునీటి పథ‌కం కింద వచ్చిన నిధులలో 492 కోట్లు ఈ ప్రభుత్వ అసమర్థ నిర్వాకం వల్ల నిష్ఫ‌లం అవ్వటం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత, అవినీతికి అద్దం పడుతోంది. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు జీవనోపాధి కల్పించే పథకాల నిర్వహణలో లోపాలను ఎత్తి చూపిస్తూ 59 శాతం యూనిట్లు ప్రారంభమే కాలేదని కాగ్ చెప్పాక దళిత బలహీన వర్గాల సంక్షేమం పట్ల చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైంది. ద్రవ్య లోటు 3.25 శాతం నుండి 3 శాతానికి తగ్గి స్తామని గత ఏడాది చెప్పిన మాటలు కల్లలై వీరు చేసిన ఇబ్బడి ముబ్బడి అప్పుల వల్ల ద్రవ్య లోటు తగ్గక పోగా 4.42 శాతానికి పెరిగింది.

పై పెచ్చు రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు బాండ్ల రూపంలో ప్రజల దగ్గరి నుండి రుణాలు సేకరిస్తాడట.. 'ప్రపంచ స్థాయి' రాజధాని మేనియాతో ఊరేగుతూ, అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయి, అసమర్థత, అవకాశ వాదాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఎంత త్వరగా సాగనంపితే రాష్ట్ర ప్రజలకు అంత మేలు" అని రఘువీరా రెడ్డి అందులో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News