parliament: లోక్ సభ పనిచేసింది ఒక్క శాతం... రాజ్యసభ 6 శాతం

  • 250 గంటల సమయం వృథా 
  • పలు పార్టీల నుంచి ఆటంకాలు
  • లోక్ సభలో 5, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విలువైన సమయం అంతా సభ్యుల ఆందోళనలకు వృథా అయిపోయింది. శుక్రవారంతో పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన విషయం విదితమే. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం సమయంలో లోక్ సభ కేవలం ఒక శాతమే చట్టపరమైన కార్యకలాపాల కోసం పనిచేసింది. రాజ్యసభ ఈ విషయంలో కాస్తంత మెరుగు. మొత్తం సమయంలో ఆరు శాతం మేర చట్ట సంబంధిత కార్యకలాపాలు కొనసాగాయి.

పీఎన్ బీ స్కామ్, ఎస్సీ, ఎస్టీ చట్టం వంటి అంశాలు చర్చకు రాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరిగిన విషయం తెలిసిందే. మొత్తం మీద సభ్యుల ఆందోళనతో 250 గంటల సమయం వృథాగా పోయింది. లోక్ సభ 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా, రాజ్యసభ 44 గంటలు పనిచేసింది. 2000 సంవత్సరం తర్వాత ఇంత తక్కువ వ్యవధి పాటు బడ్జెట్ సమావేశాలు నడిచింది ఈ పర్యాయమేనని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది.

పెద్దల సభలో 2 గంటల 31 నిమిషాలు చట్టపరమైన అంశాలపై చర్చ జరగ్గా, ప్రభుత్వ బిల్లులపై కేవలం మూడు నిమిషాలే మాట్లాడడం జరిగింది. మిగిలిన సమయం అంతా ప్రైవేటు సభ్యుల బిల్లులకే ఖర్చయింది. లోక్ సభ చట్టపరమైన అంశాలపై 19 నిమిషాలు పనిచేయగా, ఇందులో 14 నిమిషాలను కేవలం రెండు బిల్లుల ఆమోదానికి ఖర్చు చేసిందే. మొత్తం మీద లోక్ సభ ఐదు బిల్లులు, రాజ్యసభ ఒక బిల్లు ఆమోదించాయి. వివిధ రాజకీయ పక్షాలు పలు అంశాలపై సభా కార్యకాలాపాలను అడ్డుకున్న విషయం విదితమే

  • Loading...

More Telugu News