Narendra Modi: నేను ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. 12న నిరాహార దీక్ష చేస్తున్నా: మోదీ ఆవేదన

  • పేద తల్లి కుమారుడినైన నేను ప్రధాని కావడాన్ని ఓర్చుకోలేక పోతున్నారు
  • నాపై ఉన్న వ్యతిరేకత హింసాత్మక రూపుదాల్చుతోంది
  • ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అంతమొందిస్తోంది
  • పార్లమెంటులో నన్ను చుట్టుముట్టినంత పని చేశారు

బలహీన సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుకోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన, పేద తల్లి కుమారుడినైన తాను ప్రధాని కావడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాల్లో పుట్టిన వారు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్న విషయాన్ని అంగీకరించలేక పోతున్నారని చెప్పారు.

తనపై ఉన్న వ్యతిరేకత హింసాత్మక రూపం దాల్చుతోందని అన్నారు. మనం ఎలాంటి తప్పులు చేయలేదని... ఈ హింసకు కారణం బీజేపీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేకపోవడమేనని... ఇతర పార్టీలు బీజేపీ ఎదుగుదలను సహించలేకపోతున్నాయని మండిపడ్డారు. బీజేపీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. ఇటీవల నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన విషయంపై మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని ప్రతి ఒక్కరి ప్రయోజనాల కోసం బీజేపీ కార్యకర్తలు పని చేయాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అంతమొందిస్తోందని ఆయన అన్నారు. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చుతోందని విమర్శించారు. పార్లమెంటు కార్యక్రమాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న తీరును నిరసిస్తూ... తాను ఈ నెల 12న నిరాహారదీక్ష చేపట్టబోతున్నానని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతున్నప్పుడు... తనను విపక్ష సభ్యులు దాదాపు చుట్టుముట్టినంత పని చేశారని అన్నారు. పార్లమెంటులో ప్రధాని ప్రసంగిస్తుంటే ఇలాగేనా వ్యవహరించేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని చెప్పారు. అలాంటి పార్టీలను బీజేపీ ఎంపీలంతా ఎండగట్టాలని సూచించారు.

కార్యకర్తలే బీజేపీకి బలమని మోదీ అన్నారు. కార్యకర్తల నిర్విరామ కృషి, కార్యకర్తల ఆశీస్సుల వల్లే బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.

More Telugu News