Salman Khan: జైలులో భోజనం చేయకపోయినా.. మూడు గంటలు వ్యాయామం చేసిన సల్మాన్

  • వరుసగా మూడు పూటలు భోజనం చేయని సల్మాన్
  • నటి ప్రీతి జింటా, సోదరిలు అల్విరా, అర్పితలను చూశాక హుషారు
  • మూడు గంటల పాటు జైలు గదిలో వ్యాయామం
కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్ష అనుభవించేందుకు జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు చేరుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భోజనం చేయకున్నా తన డైలీ వర్కవుట్‌ను మాత్రం వదలిపెట్టలేదు. శుక్రవారం సాయంత్రం దాదాపు మూడు గంటలపాటు సల్మాన్ వార్డ్ నంబరు 2లో వర్కవుట్లు చేసినట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు. క్రంచెస్, పుషప్స్, స్కిప్పింగ్, జంపింగ్‌తోపాటు ఇతర వ్యాయామాలు చేసినట్టు పేర్కొన్నారు.

అల్పాహారం తీసుకునేందుకు నిరాకరించిన సల్మాన్, జైలు క్యాంటీన్ నుంచి ఏమైనా కొనుగోలు చేసుకోవచ్చా? అని సిబ్బందిని ప్రశ్నించాడు. గ్లాసు పాలు రొట్టె ఇచ్చినట్టు జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఉదయం 9:45 గంటల వరకు సల్మాన్ తన వార్డులో అసహనంగా అటూఇటూ తిరుగుతూ కనిపించాడని పేర్కొన్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో బెయిలుపై విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసిందని సల్మాన్‌కు చెప్పగానే మధ్యాహ్నం భోజనం చేయడం మానేశాడన్నారు.

వరుసగా మూడు పూటలు భోజనం చేయడం మానేసినా నటి ప్రీతి జింటా, సోదరిలు అల్విరా, అర్పితలను చూసిన తర్వాత సల్మాన్ ఉత్సాహంగా కనిపించాడని, వర్కవుట్లు చేశాడని విక్రమ్ సింగ్ తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించిన వ్యాయామాన్ని సాయంత్రం 6:30 గంటల వరకు చేశాడని వివరించారు.
Salman Khan
workout
Jodhpur
central Jail

More Telugu News