Supreme Court: కొందరు టెర్రరిస్టుల కోసం 120 కోట్ల మందిని ఇబ్బంది పెడతారా?: కేంద్రానికి సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్న

  • టెర్రరిస్టులు కూడా సిమ్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారా?
  • బ్యాంకు మోసాలను ఆధార్ అరికడుతుందా?
  • బ్యాంకు అధికారులు, మోసకారులు కలిసే ఫ్రాడ్ చేస్తున్నారు

మొబైల్ ఫోన్లను ఆధార్ తో లింక్ చేసుకోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 120 కోట్ల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అభిప్రాయపడింది. టెర్రరిస్టులు కూడా సిమ్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారా? అని ప్రశ్నించింది. కొంత మంది టెర్రరిస్టులను పట్టుకోవడం కోసం... 120 కోట్ల ప్రజల మొబైల్స్ ను ఆధార్ తో అనుసంధానం చేయాలనే నిర్ణయం చాలా ఇబ్బందికరమైనదని తెలిపింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కేంద్రాన్ని నిలదీసింది.

ప్రతి దాన్నీ ఆధార్ నంబరుతో లింక్ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించే క్రమంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. బ్యాంకింగ్ మోసాలను ఆధార్ అరికడుతుందా? అని బెంచ్ సూటిగా ప్రశ్నించింది. మోసాలకు పాల్పడిన వారు ఎవరో అందరికీ తెలుసని... లోన్లు ఎవరికి ఇస్తున్నామన్న సంగతి బ్యాంకులకు తెలుసని... బ్యాంకు అధికారులు, మోసకారులు కలిసే ఫ్రాడ్ కు పాల్పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇలాంటి వాటిని అరికట్టడంలో ఆధార్ చేసేది చాలా స్వల్పమేనని చెప్పింది. మోసకారులు ఎవరో తెలియకుండానే... బ్యాంకుల్లో మోసాలు జరగడం లేదని తెలిపింది. బ్యాంక్ మోసాలను ఆధార్ కార్డులు అరికట్టలేవని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు చెప్పింది.

విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ, బయోమెట్రిక్స్ ద్వారా బ్యాంకు మోసాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలు, టెర్రరిజాన్ని అరికట్టవచ్చని చెప్పారు. ఆధార్ కోసం అతి తక్కువ సమాచారాన్ని మాత్రమే వ్యక్తుల నుంచి తీసుకుంటున్నామని... అది కూడా పబ్లిక్ డొమైన్ లో దొరికేదేనని తెలిపారు. వ్యక్తుల చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు పబ్లిక్ డొమైన్లలో ఉండేవేనని చెప్పారు. మరోవైపు ఆధార్ డేటాకు సంబంధించి పూర్తి రక్షణ ఉందని తెలిపారు.  

More Telugu News