China: రెడ్ లైట్ ఏరియాకు వెళ్లనిచ్చేది లేదన్న పాక్ పోలీసులు... ఇదేనా స్నేహమంటూ చావగొట్టిన చైనా కార్మికులు!

  • చైనా కార్మికులపై పాక్ సైన్యం ఆంక్షలు
  • వేశ్యల వద్దకు వెళ్లకుండా నిషేధం
  • కుర్చీలు, బల్లలతో దాడులకు దిగిన చైనీయులు
  • పలువురు పోలీసులకు గాయాలు

చైనా, పాకిస్థాన్ మధ్య ఎకనామిక్ కారిడార్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా స్నేహబంధం బలోపేతం కాగా, అది నామమాత్రమేనని, తమను చాలా హీనంగా చూస్తున్నారని పాక్ ప్రాంతంలో వివిధ మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా కార్మికులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఘటన ఒకటి, చైనా కార్మికులు, పాక్ పోలీసులు, సైనికుల మధ్య జరుగుతున్న వివాదాన్ని మరింతగా పెంచింది.

'డాన్' పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, కొంతమంది చైనా కార్మికులు, పాకిస్థాన్ లోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, పోలీసులు అడ్డుకుని, వారికి ఆ ప్రాంతంలోని వేశ్యల వద్దకు ప్రవేశం లేదని, నిషేధం అమలవుతోందని స్పష్టం చేశారట. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చైనా కార్మికులు, "ఇదేం స్నేహం?" అని ప్రశ్నిస్తూ వారిపై భౌతిక దాడులకు దిగారు.

భవల్ పూర్, ఫైసలాబాద్ జాతీయ రహదారిపై ఉన్న రెడ్ లైట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చైనా ఇంజనీర్లు క్యాంపస్ ను వదిలి వెళ్లేందుకు వీలులేదని, వారిని సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లనివ్వబోమని సైన్యం స్పష్టం చేసిన వేళ, నిరసనలకు దిగిన కార్మికులు, పనులను ఆపేసి గొడవకు దిగారు. పాకిస్థాన్ గార్డులు సేదదీరే ప్రాంతానికి వెళ్లే విద్యుత్ లైన్లను తొలగించారు.

కుర్చీలు, బల్లలు సహా దొరికిన పరికరాలు తీసుకుని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు సైనికులకు గాయాలు అయ్యాయి. భారీ యంత్ర సామానులను రోడ్లపైకి తెచ్చి ట్రాఫిక్ కు అవాంతరాలు కలిగించిన చైనా కార్మికులు, పోలీసుల వాహనాలపైకి ఎక్కి నినాదాలు చేశారు. తమపై సైన్యం దాడులకు దిగుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే, తాము పనులు చేయలేమని చెబుతూ పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటనలపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించాల్సివుంది.

More Telugu News