Lok Sabha: అనుకున్నదే జరిగింది... అవిశ్వాసం పేరెత్తకుండానే లోక్ సభ నిరవధిక వాయిదా

  • చివరి రోజూ స్పందించని అధికార ఎన్డీయే
  • కొనసాగిన అన్నాడీఎంకే ఆందోళనలు
  • లోక్ సభ సమావేశాలపై ప్రకటన చేసిన సుమిత్రా మహాజన్
  • ఆపై వెంటనే నిరవధిక వాయిదా

అనుకున్నదే జరిగింది. లోక్ సభ చివరి రోజు కూడా అధికార పార్టీలో కదలిక కనిపించలేదు. ఏఐఏడీఎంకే సభ్యులకు నచ్చజెప్పాలని, అవిశ్వాస తీర్మానంపై చర్చిద్దామని ప్రభుత్వం భావించలేదు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ 11.15 గంటల సమయంలో ప్రకటించారు. అంతకుముందు 11 గంటలకు సభ ప్రారంభమైన తరువాత అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి వెళ్లి, తమ కావేరీ నదీ జలాల బోర్డు సంగతేంటని నినాదాలు చేశారు.

తాను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నానని, సభను కాసేపు శాంతంగా ఉండనివ్వాలని సుమిత్రా మహాజన్ చేసిన విజ్ఞప్తిని సభ్యులంతా మన్నించగా, బడ్జెట్ మలిదశ సమావేశాలపై ఆమె ఓ ప్రకటన చేశారు. సభ నడిచిన రోజులు, సమావేశపు వివరాలు, ఆమోదం పొందిన బిల్లుల గురించి క్లుప్తంగా చెప్పారు. ఆపై వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని చెప్పిన సుమిత్ర, అది ముగియగానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. లోక్ సభ వాయిదా పడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు సభలోనే ఉండటం గమనార్హం. 

More Telugu News