TTD: ఇక క్యూలోకి వెళ్లిన రెండు గంటల్లోనే వెంకన్న దర్శనం: టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్

  • 22 నుంచి సర్వదర్శనం టైమ్ స్లాట్ అమలు
  • వెల్లడించిన టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్
  • వేసవి సెలవుల్లో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనం

ఇకపై తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసే అవసరం రాదని, ఈ నెల 22 నుంచి సర్వదర్శనం భక్తులకు టైమ్ స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నట్టు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ ఈ ఉదయం వెల్లడించారు. ఫిబ్రవరిలో పైలట్ ప్రాజెక్టుగా టైమ్ స్లాట్ విధానాన్ని పరిశీలించి విజయవంతం అయ్యామని గుర్తు చేసిన ఆయన, క్యూలైన్ లోకి వెళ్లిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.

 ఇక వేసవి సెలవులు ప్రారంభమై, రద్దీ పెరిగిన దృష్ట్యా, రెండు నెలల పాటు ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 290 టీటీడీ కల్యాణ మండపాలను ఆధునికీకరిస్తామని తెలిపారు. ఆదివారం నుంచి జరిగే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ నాలుగు రోజుల పాటు సాగనుందని తెలిపారు. 24 నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరుగుతాయని సింఘాల్ వెల్లడించారు.

More Telugu News