rfid: విలేకరుల కదలికలను గుర్తించేందుకు ఆర్ఎఫ్ఐడీ కార్డులు .. పీఐబీ ప్రతిపాదన!

  • ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేసే ఉద్దేశంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
  • గత జనవరిలో హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన పీఐబీ
  • తదుపరి పురోగతి ఏమీ లేదు

నకిలీ వార్తలు రాసే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేయడం, దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో, ఆ వెంటనే ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడం తెలిసిందే. అయితే, దీనికి ముందుగానే, మరో వివాదాస్పద చర్యకు సదరు మంత్రిత్వ శాఖ ఉపక్రమించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 విలేకరుల కదలికలను కనిపెట్టే నిమిత్తం వారికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ ) కార్డులు జారీ చేయాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆలోచిస్తోంది. ‘ది ప్రింట్’ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం .. విలేకరుల కదలికలను కనిపెట్టేందుకు వారికి ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేసే విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పీఐబీ గత జనవరిలో ఓ లేఖ రాసింది. ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి

ఆర్ఎఫ్ఐడీ కార్డుల ప్రతిపాదన నిజమే

ఈ విషయమై పీఐబీ డైరెక్టర్ జనరల్ ఫ్రాంక్ నోరోన్హా మాట్లాడుతూ, ఆర్ఎఫ్ఐడీ కార్డుల ప్రతిపాదన నిజమేనని, అయితే దీనికి సంబంధించి తదుపరి పురోగతి ఏమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా విలేకరులకు ఇచ్చే అక్రిడేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. అక్రిడేషన్ల వినియోగం, భద్రత, ఇతర అంశాలను మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  

ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేస్తే పంచ్ చేయాల్సిందే!


విలేకరులకు ఆర్ఎఫ్ఐడీ కార్డులు కనుక జారీ చేస్తే ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లాలంటే పంచ్ చేయక తప్పదు. వివిధ వస్తువులకు అనుసంధానించే ట్యాగ్ లను గుర్తించేందుకు ఆర్ఎఫ్ఐడీ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటుంది.  ఇదిలా ఉండగా,  2015లో  పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు వచ్చాయి. ఈ సంఘటన నేపథ్యంలో భద్రతా చర్యలు విస్తృతం చేసే మార్గాలపై పీఐబీ దృష్టిపెట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే ఆర్ఎఫ్ఐడీ కార్డుల ప్రతిపాదన చేసిందని సంబంధిత వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News